మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. బ్యానర్లు, గోడరాతలు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించా.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటి ఓటరు జాబితా ఆధారంగా వార్డులగా వారీగా ఓటర్ల విభజన కూడా పూర్తయింది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తదితరాలపై కసరత్తు జరుగుతోంది. సుమారు రెండు వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణకు అవసరమవుతారని అంచనా. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం రెండు లేదా మూడు వార్డులకు ఒకరు వంతున ఎన్నికల అధికారిని నియమిస్తున్నాం. పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌లో ఉన్న సిబ్బందిని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నుంచి మినహాయిస్తున్నాం. ఎన్నికల కోడ్ పర్యవేక్షణ బాధ్యత తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించాం.
ఆర్డీవోలు, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. డీఆర్‌డీఏ పీడీ, జడ్పీ సీఈవోలు నాలుగేసి మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నారు.
బందోబస్తుపై ప్రత్యేక దృష్టి
ఎన్నికలు నిష్పాక్షికంగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వర్తించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జిల్లా ఎస్పీతో సమావేశం ఏర్పాటు చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో సమీప గ్రామాల నుంచి ఓటర్ల తరలింపు, మద్యం, నగదు సరఫరా తదితరాలను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలు, నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. కోడ్ పర్యవేక్షణకు రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించాం. మంగళవారం నుంచే వీరు బాధ్యత చేపట్టాల్సి ఉంటుంది. అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాల తరలింపు, నగదు, బహుమతులు తదితరాలపై మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు నిఘా వేస్తారు. గ్రామ స్థాయిలో ఎన్నికలకు సంబంధించి పార్టీలు, అభ్యర్థులు, ఇతరుల కదలికలను ఓ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు పొందు పరిచేలా శిక్షణ ఇస్తున్నాం.
సార్వత్రిక ఎన్నికలకూ...
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు నెలలుగా ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నాం. అన్ని స్థాయిల్లో నోడల్ అధికారుల నియామకం పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సుమారు 30వేల మంది సిబ్బంది సమాచారం ఫోన్ నంబర్లతో సహా సేకరించాం. పోలింగ్ విధులకు వచ్చే పోలీసులు, వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు తదితరులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఎన్నికల నిర్వహణలో కీలకమైన 15అంశాల పర్యవేక్షణకు ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశాం. మీడియాలో ప్రచురితమయ్యే పెయిడ్ న్యూస్‌పైనా నిఘా వేసేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని నియమించాం.
పరీక్షలపై ప్రత్యేక దృష్టి
పది, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఇటు విద్యార్థులకు, అటు ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ‘ప్రేరణ’ తరగతులు ప్రారంభించాం. పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నాం. మున్సిపల్ పోలింగ్ బూత్‌లు వున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.