లారీ ఢీకొని నర్సరీ రైతు దుర్మరణం
లారీ ఢీకొని నర్సరీ రైతు దుర్మరణం
వేమగిరి (కడియం), :
మండలంలోని వేమగిరి వద్ద హైవేపై కొత్తపల్లి అరవ రాజేష్ (అరవాలు) (24) అనే నర్సరీరైతు లారీ ఢీకొని దుర్మరణం పాల య్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బుర్రిలంక గ్రామానికి చెందిన రాజేష్ వేమగిరిలోని తన నర్సరీలో పనిచేసే కూలీలకు టీ తీసుకువెళ్లేందుకు వేమగిరి సెంటర్‌కు వచ్చాడు. వేమగిరి తోట వద్ద మోటారు సైకిల్‌పై డివైడర్‌ను దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వెనుక వస్తున్న క్వారీ లారీ కూడా అదే డివైడర్‌ను దాటేందుకు మలుపు తిరిగింది. దీంతో మోటారు సైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడియం ఇన్‌స్పెక్టర్ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్సై శివాజీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని కడియం స్టేషన్‌కు తరలించారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బుర్రిలంక ఉం టుంది. సంఘటన విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామం నుంచి రాజేష్ స్నేహితులు, బంధువులు, నర్సరీ రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. పొలానికి వెళ్లి ఇప్పుడే వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన రాజేష్ ఇంతలోనే ప్రమాదం భారిన పడి మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని నర్సరీని అభివృద్ధి చేస్తున్నాడని, ఇంతలో ఇలా జరిగిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.