కరవు నేలకు కల్పవల్లి | rural development trust in anantapur district | Sakshi
Sakshi News home page

కరవు నేలకు కల్పవల్లి

Published Mon, Jun 8 2015 4:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కరవు నేలకు కల్పవల్లి - Sakshi

కరవు నేలకు కల్పవల్లి

1969లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు
పేదల అభ్యున్నతికి కృషి  3,244 గ్రామాల్లో కార్యకలాపాలు

 
తన కోసం, తన కుటుంబం కోసం బతికేవారు కొందరు. సమాజం కోసం, పేదల అభ్యున్నతి కోసం జీవించేవారు కొందరు. రెండో కోవకు చెందిన వారే ఫాదర్ విన్సెంట్ ఫై. ఎక్కడో స్పెయిన్‌లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని కరవు నేలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 45 ఏళ్ల క్రితం అనంతపురంలో ‘రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్’(ఆర్డీటీ) స్థాపించి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. 2009లో తనువు చాలించినప్పటికీ పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఆర్డీటీలో  చిన్నారుల ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభమైన సందర్భంగా సంస్థ  విశేషాలు తెలుసుకుందాం.
 
ఏర్పాటు
స్పెయిన్ దేశానికి చెందిన ఫై 1952లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. మహారాష్ట్రలోని మన్మాడ్‌లో కరవు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి చలించిపోయారు. మన్మాడ్‌లో ‘రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి 3వేల బావులు తవ్వించారు. పేద రైతులకు ఉచితంగా మోటార్ బోర్లు ఇచ్చారు. తర్వాత 1969లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విన్సెట్ ఫై, అన్నె ఫై దంపతులు ‘రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి సేవలు విస్తృతం చేశారు.
 
లక్ష్యాలు
గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి ఆర్డీటీ కృషిచేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 3,244 గ్రామాల్లో పనిచేస్తోంది.  మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, గృహ, వాటర్ షెడ్ల నిర్మాణంపై దృష్టిసారించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత చదువులు చదివిస్తోంది. గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేస్తోంది. ప్రస్తుతం ఫై కుమారుడు మాంచో ఫై ఆర్టీటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంస్థ నిర్వహణ కోసం స్పెయిన్ , యూరప్ దేశాలు ఆర్థికసాయం చేస్తున్నాయి.
 
క్రీడల్లో మేటి
విద్యతో పాటు క్రీడలకూ ఆర్డీటీ ప్రాధాన్యమిస్తోంది. అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని పంగల రోడ్డు సమీపంలో ‘క్రీడా గ్రామాన్ని’ నిర్మించింది. స్పెయిన్ దేశానికి చెందిన టెన్నిస్ రారాజు రాఫెల్ నాదల్ 2010 అక్టోబర్ 17న ‘నాదల్ టెన్నిస్ అకాడమీ’ని ఇక్కడ నెలకొల్పారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చుచేసి ఐదు టెన్నిస్ కోర్టులు నిర్మించారు. విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 170 మంది శిక్షణ పొందుతున్నారు. నిర్వహణ కోసం 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు.
 
ఉచిత వైద్యం
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోవడం ఫైను కలచివేసింది. వారి కోసం కార్పొరేట్  స్థాయిలో ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యం అందివ్వాలని సంకల్పించారు. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లిలో ‘ఆర్డీటీ ఆసుపత్రి’ నిర్మించారు. హాస్పిటల్‌లో చేరిన రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్డీటీ సహకారంతో వైద్య విద్య అభ్యసించినవారు ఇక్కడ డాక్టర్లుగా  సేవలందిస్తున్నారు.
 
వాటర్ షెడ్లు
నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్న విషయాన్ని ఆర్డీటీ గుర్తించింది. గ్రామాల్లో అనువైన ప్రాంతాల్లో వాటర్‌షెడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. వర్షపు నీటి వృథా కట్టడిచేసింది. అనతి కాలంలోనే భూగర్భ జల వనరుల శాతం పెరిగింది. నీటి వాడకం తగ్గించేందుకు పేద రైతులకు ఉచితంగా బిందు, తుంపర సేద్య పరికరాలు ఇస్తోంది. పండ్ల తోటల సాగును ప్రోత్సహించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చీనీ సాగు చేస్తున్నది అనంతపురం జిల్లాయే.
 
గృహ కల్పన
సొంత ఇళ్లు లేనివారికి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులకు ఇంటి స్థలం ఉంటే చాలు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ఆర్డీటీ భరిస్తుంది. నాణ్యాతా ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్మాణం చేపడుతుంది. అంతే కాకుండా వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కదిరి మండలంలోని మొటుకుపల్లిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 7,899 స్వయం సేవా సంఘాలను ఆర్టీడీ నడుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement