ఇసుక మాఫియా
=వరాహ, తాండవ నదుల్లో తవ్వకాలు
=రోజూ వందలాది ట్రాక్టర్లతో తరలింపు
=పట్టించుకోని రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
=సముద్రపు ఇసుకనూ వదలని వైనం
నక్కపల్లి, న్యూస్‌లైన్: ఎస్.రాయవరం,నక్కపల్లి,పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు వరాహనదిలో పొక్లెయినర్లు ఉపయోగిస్తున్నారంటే తరలింపు ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చు.
వందలాది ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్‌లు మూలకు చేరే దుస్థితి దాపురించింది. ఎస్‌రాయవరం మండలంలో దార్లపూడి, పెనుగొల్లు,వమ్మవరం,పెద ఉప్పలం,దార్లపూడి,లింగరాజుపాలెం, బసవపాడు, కోటవురట్లమండలం పందూరు, రామచంద్రపురం, పాయకరావుపేట మం డలం కొత్తూ రు, సత్యవరం బ్రిడ్జి, కేశవరం,పాయకరావుపేట,ప్రాంతాల్లో రోజూ వేలాది క్యూబిక్ మీటర్ల లో ఇసుక తవ్వుతున్నారు.
వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ట్రాక్ట ర్లు, లారీలపై తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 3వేల వరకు అమ్ముడుపోవడంతో మాఫియాకు కాసులు కురుస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో వారు రెచ్చిపోతున్నారు. ఇందులో రెవెన్యూ, పోలీసు అధికారుల ప్రమేయం ఉంటోందన్న వాదన ఉం ది. ఇక తీరప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
రాజయ్యపేట, అమలాపురం, పాటిమీద, మూలపర, డిఎల్‌పురం,బోయపాడు, చందనాడ బంగారయ్యపేట, రేవుపోలవరం, బంగారమ్మపాలెం తదితర గ్రామాల్లో తీరప్రాం తం వెంబడి సముద్రపు ఇసుకను కూడా మాఫియా వదలడం లేదు. దీని తరలింపునకు వీఆర్వోలే సహకారిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇసుక తరలించుకుపోవడంతో తుఫాన్లప్పుడు సముద్రం ముందు కు చొచ్చుకు వస్తోంది. ముంపు బారిన పడే ప్రమాదం ఉందని గంగపుత్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.