వారి సంకల్పబలం ముందు వరుణుడు సైతం చిన్నబోయాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా సమైక్యవాదులు ఉరకలెత్తారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షాన్ని సైతం వారు లెక్క చేయలేదు. చెక్కుచెదరని మనోధైర్యంతో ఉద్యమ కెరటాలై ఎగిశారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారుల సమైక్య నినాదాలతో కాకినాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ హోరెత్తింది. సమ్మెను తాత్కాలికంగా విరమించామే తప్ప.. ఉద్యమాన్ని విరమించలేదని సభకు వచ్చిన ఉద్యోగులు చాటిచెప్పారు. విభజన విషయంలో ఏమాత్రం ముందడుగు వేసినా మళ్లీ నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ప్రతికూల వాతావరణంలో సైతం సభను విజయవంతం చేశారు.
సాక్షి, కాకినాడ: విభజన ప్రక్రియ ఆగే వరకూ ఉద్యమం కొనసాగుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగానే ముందుకు తీసుకువెళ్తామన్నారు. డిసెంబర్ నుంచి ఉద్యమం కొత్త పంథాలో సాగనుందని వెల్లడించారు. ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ర్ట విభజన జరుగుతోందన్నారు. విభజనను అడ్డుకునేందుకు తాము చేస్తున్న ఉద్యమానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులు తూట్లు పొడుస్తున్నారని, వారికి త్వరలోనే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఐటీ విభాగం చైర్మన్ బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఇది కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికుల పోరాటం కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మనతోపాటు పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ మాట్లాడుతూ రూ.2 లక్షల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో హైదరాబాద్‌లోని పార్కులు, రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేశారని గుర్తు చేశారు. ‘మా నిధులను హైదరాబాద్‌కు మళ్లించి, ఇప్పుడు ఆ హైదరాబాద్ మాది కాదంటే ఎలా ఒప్పుకుంటాం?’ అని ప్రశ్నించారు. రాజీనామా డ్రామాలాడుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని సీమాంధ్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ముత్తాబత్తుల రత్నకుమార్ అన్నారు.
ఏపీఎన్జీవోలు ఏ పిలుపు ఇచ్చినా తాము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ఇంత భారీ వర్షంలో కూడా తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే నోట మాట రావడంలేదని, సమైక్య ఉద్యమానికి కాకినాడ సభ మరో మలుపు కానుందని చెప్పారు. జిల్లా కార్యదర్శి పితాని త్రినాధ్ మాట్లాడుతూ, కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన సమైక్యవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలే లేకపోతే సమైక్య ఉద్యమం జరిగేది కాదన్నారు.
ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో తాత్కాలిక విరమణ పాటించడం సరికాదని, విభజన పూర్తిగా ఆగేవరకూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమైక్యవాదులపైనే ఉందని అన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ ఆలీ మాట్లాడుతూ సీడబ్ల్యుసీ నిర్ణయానికి ముందే తాము ఉద్యమబాట పట్టామని, గత 54 రోజులుగా సీమాంధ్రలో 35 వేల మంది న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
ఈ సభలో మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఏపీఆర్‌ఎస్‌ఏ ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు అనిల్ జాన్సన్, కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, పీఎన్ మూర్తి, బండారు రామ్మోహనరావు, ఆదినారాయణ, విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి, తులసిరత్నం, కుమారిచౌదరి యాదవ్, సుబ్బారావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మాలమహానాడు అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జనకెరటం
సాక్షి, కాకినాడ : కుండపోత వర్షంలో సైతం వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారుల సమైక్యనినాదాలతో కాకినాడలో మంగళవారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ హోరెత్తింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో అవకాశం లేదని సమైక్యవాదులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరో గంటలో సభ ముగుస్తుందనే వరకూ తరలివస్తూనే కనిపించారు. కుండపోత వర్షంలో ఏకంగా మూడు గంటలకు పైగా సభ కొనసాగినా జనం ఎక్కడా చెక్కుచెదరలేదు. రాష్ర్ట నేతల ప్రసంగాలకు ఉద్యమకారుల నుంచి విశేష స్పందన లభించింది. కందుకూరి వీరేశలింగం వేదిక నుంచి ఏపీ ఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుతో సహా రాష్ర్ట, జిల్లా నేతలందరూ సమైక్యనాదం వినిపించారు. రాష్ర్ట విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్విహించి సీమాంధ్రుల సత్తా చాటుతామన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రారంభంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరం రేలారేరేలా బృందం ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనకు ఉద్యమకారులు చిందులేశారు. అశోక్‌బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తాము ఏ రాజకీయ నాయకులకూ అమ్ముడుపోలేదని.. ప్రజాభిమానానికి అమ్ముడుపో యామని అన్నారు.
ఆ అభిమానం కావాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ పదవులకు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమబాట పట్టాలని సూచించారు. ఈ నెల 23 నుంచి నవంబర్ 5 వరకూ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదంతో ప్రకటింప జేశారు. కాకినాడ రూరల్ నేతలు గజమాల, పూల కిరీటంతో అశోక్‌బాబును సత్కరించగా, రైతులు నాగలి బహూకరించారు. జోరువానలో జరిగిన ఈ సభ విజయవంతం కావడం సమైక్యవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది.
జోరువానలో..జనకెరటం
Published Wed, Oct 23 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement