యువకునిపై చేయిచేసుకున్న ఎస్‌ఐ
మాకవరపాలెం : మోటార్ బైక్‌పై వెళ్తున్న యువకుడిపై ఎస్‌ఐ చేయిచేసుకోవడంతో స్థానికులు ఇక్కడ ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు కొనసాగిన ఈ ఆందోళన ఇన్‌చార్జి సీఐ చొరవతో సద్దుమణిగింది. మండల కేంద్రానికి చెందిన లాలం లోవకుమార్ (బుజ్జి) మంగళవారం సాయంత్రం మోటార్ బైక్‌పై వెళ్తున్నాడు.
అదే సమయంలో వారపు సంతలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపారు. దీంతో ఏఎస్‌ఐ ఉలఖ్‌కు బుజ్జికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో పక్కనే ఉన్న ఎస్‌ఐ బుజ్జిపై చేయిచేసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. దీంతో స్వల్పంగా గాయపడిన బాధితుడ్ని కుటుంబ సభ్యులు, స్థానికులు స్టేషన్ ఎదుట రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు.
సుమారు మూడు గంటలపాటు ఈ ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ఇన్‌చార్జి సీఐ దాశరథి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించాలని సూచించారు. ఎస్‌ఐ చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళనను విరమించి బుజ్జిని నర్సీపట్నం తరలించారు.