జనమే జనం | Simhapuri people in support of Jagan | Sakshi
Sakshi News home page

జనమే జనం

Published Fri, Aug 30 2013 4:33 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Simhapuri people in support of Jagan

సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఆమరణదీక్ష చేపట్టిన జగన్‌కు మద్దతుగా సింహపురి జనం కదం తొక్కారు. అండగా తామున్నామంటూ నినదిం చారు. చంచలగూడ జైల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరదీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో, ర్యాలీలు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం తదితర ఆందోళ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
 
 వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నియోజకవర్గం వ్యాప్తంగా ర్యాలీలు,నెల్లూరులో పార్టీ సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. గూడూరు సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. వీటితోపాటు జగన్‌కు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆమరణ, రిలేదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
 
   నెల్లూరులో వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో జగన్‌కు మద్దతుగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరురూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన సోనియా కొడుకు రాహుల్‌ను ప్రధాని చేసుకునేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు.
 
  గూడూరు సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య చేస్తున్న ఆమరణ దీక్షను నాల్గో రోజు పోలీసులు భగ్నం చేశారు. అనంతరం బాలచెన్నయ్యను గూడూరు ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని ఆస్పత్రి రోడ్డులో పాతమోతిమహల్ కూడలి ప్రాంతం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు బత్తిని విజయ్‌కుమార్ చేపట్టిన రిలేదీక్ష నాల్లో రోజుకు చేరింది.
 
 ఈ దీక్షకు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
  ఉదయగిరి నియోజకవర్గం జలదంకి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉదయగిరిలో బస్టాండ్‌లో వికలాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. సీతారామపురం బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేశారు.
 
  సూళ్లూరుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పర్వతరెడ్డి కవిత ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో మానవహారం వేసి మహిళలు గొబ్బిళ్లు తట్టడం, రోడ్లు చిమ్మడం వంటి పనులతో నిరసన వ్యక్తం చేశారు. సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది.  
 
  ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్‌పేటలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు.  హసనాపురంలో సైతం కార్యకర్తలు రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. మర్రిపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు.
 
   సర్వేపల్లి నియోజకవర్గంలో టీపీగూడూరు మండలంలోని కాకుపల్లిలో పార్టీ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు  సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పొదలకూరులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు.
 
   వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు అనిల్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది.  సైదాపురం బస్టాండ్‌లో  వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకుడు మహేంద్రరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు.కావలి గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు పూనూరు శివకుమార్‌రెడ్డి, లింగం మాల్యాద్రి, తదితరులు రిలేనిరాహారదీక్ష చేపట్టారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement