చిన్నపాటి సమస్యకే డీలా పడిపోతారు..జీవితమే ముగిసిపోయినట్లు కుంగిపోతారు. నిరాశలో కాలం వెళ్లదీస్తారు. కానీ శిరీషను చూస్తే నిరాశకే నిరాశ పుట్టకమానదు..విధిరాతను తిరగరాసింది. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యానికి మనోధైర్యంతో ..పట్టుదలతో సమాధానం చెప్పింది. లక్షమందిలో ఒకరికి వచ్చే జబ్బు తనకే వచ్చినా అమ్మానాన్నల ప్రోత్సాహం శిరీషలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ లక్షణాలే ఆదివారం బెంగళూరులో రాష్ట్రపతి చేతుల మీదుగా మూడు చక్రాల కుర్చీలో కూర్చుని పురస్కామందుకునేలా చేస్తున్నాయి.
చిత్తూరు అర్బన్: ఎప్పుడైనా కాస్త నిరాశ కలిగితే చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెకు చెందిన శిరీష గురించి తెలుసుకోండి.. నిరాశ పటాపంచలవుతుంది. విజయకుమార్, సుజాత రెండో సంతా నంగా శిరీష 1987లో పుట్టింది. పుట్టుకతోనే అస్టోజెనిసిస్ ఇంపెర్‌ఫెక్టా జెనటిక్ డిజార్డర్ అనే వ్యాధి సోకింది. దీనికారణంగా శరీరంలోని కాళ్లు, చేతులు, వెన్నెముకతో పాటు అన్ని అవయవాలు సరిగా పనిచేయటం మానేశాయి. ఈ బిడ్డ పుట్టిన నాలుగేళ్లకు వైమానికదళంలో ఉద్యోగం మానేసిన విజయకుమార్ ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితంలేదు. లక్ష మందిలో చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చే లోపమని వైద్యులు చేతులెత్తేశారు. నడవలేని చిన్నారికి తామే కాళ్లయ్యారు విజయకుమార్, సుజాత దంపతులు. విజయకుమార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చేస్తున్నారు. తల్లి ఇంట్లో శిరీషకు అన్నీ తానై చేదోడుగా నిలిచారు. ఇంట్లోనే ట్యూటర్‌ను పెట్టి పాఠాలు చెప్పించారు. ఎక్కడికి కదలాలన్నా మూ డు చక్రాల సైకిలే ఆధారం. ఏం చేయాలన్నా ఎవరో ఒకరు సాయపడేవారు. ఏడో తరగతి పాసైన తరువాత చిత్తూరు షర్మన్ బాలికల పాఠశాలలో రెగ్యులర్‌గా చదివి పదో తరగతి, విజేత కళాశాలలో ఇంటర్, ఎస్‌వీ రాజు కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఉత్తీర్ణత సాధించారు.
ఆశావాదంతో అడుగులు
డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంకు ఉద్యోగాలపై శిరీష దృష్టి సారించారు. తండ్రి నేర్పిన మెలకువలతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పరీక్షలకు ప్రిపేరయ్యారు. తొలిసారే శిరీష ఈ పరీక్షల్లో అర్హత సాధించినా వైకల్యం కారణంగా ఉద్యోగం రాలేదు. తరువాత గ్రామీణ బ్యాంకు పరీక్షల్లో రాణించి అర్హత సాధించారు. ఇక్కడా అదే కారణం చూపారు.. కానీ ఉద్యోగం చేయాలనే ఆశయం ఈమెను బెంగళూరు వరకు తీసుకెళ్లింది. అక్కడ తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరింది. మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నెలకు రూ.7 వేలు జీతం. సహాయకురాలికి, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు రూ.15 వేలయ్యేవి. తండ్రి సహకరించడంతో ఆర్థిక ఇబ్బందులుండేవి కావు. అనంతరం వీడియోకాన్ సంస్థలో కస్టమర్‌కేర్‌లో పనిచేస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకు పరీక్షల్లో ప్రతిభ చాటి జూనియర్ ఆఫీసర్‌గా ఉద్యోగం సం పాదించారు శిరీష. అయినా చదువుపై మక్కువతో ఎంబీఏ చేస్తున్నారు.
నేడు కోవింద్ చేతుల మీదుగా పురస్కారం..
ఏటా ప్రత్యేక ప్రతిభావంతులుగా స్ఫూర్తిదాయకంగా నిలిచేవారికి భారత ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తుంది. వైకల్యం వెక్కిరించినా తన కెరీర్‌ను చక్కగా మలుచుకుని రాణిస్తున్న శిరీష ఈ ఏడాది ఇలా ఎంపికైన జాబితాలో చోటు సంపాదించింది. మన జిల్లా నుంచి ఇలా ఎంపికైంది ఈమె ఒక్కరే. ఆదివారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇప్పటికే శిరీష కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment