సాక్షి నెట్‌వర్క్: సెలవు లేదు.. విరామం లేదు. అవిశ్రాంతంగా ఆదివారం కూడా సమైక్యపోరాటం వాడవాడలా హోరెత్తింది. సమైక్యాంధ్రప్రదేశ్ యథాతథంగా కొనసాగుతుందంటూ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటనే లక్ష్యంగా ఉద్యమకారులు ఉద్ధృతంగా పోరాటాన్ని సాగిస్తున్నారు. 33 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమమైనా, స్కూళ్లు, కాలేజీల మూత కొనసాగుతున్నా, 21రోజులుగా ఉద్యోగుల సకలం బంద్‌లో పరిపాలన పూర్తిగా స్తంభించినా సీమాంధ్ర ప్రజ ఏమాత్రం సడలకుండా సమైక్యమే లక్ష్యంగా పోరుసాగిస్తోంది.
గిరిజనుల వినూత్న నిరసన
విశాఖపట్నం: వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ఆదివారం ఏజెన్సీలో బంద్ ప్రకటించారు. ఆరు మండలాల్లో మొత్తం దుకాణాలు బంద్ పాటించాయి. అరకు ఎమ్మెల్యే సివేరి సోమ ఆధ్వర్యంలో గిరిజనులు చెట్ల ఆకులు, కొమ్మలు ఒంటికి చుట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. అనకాపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ సమైక్యాంధ్రను కోరుతూ మోకాళ్లపై నిరసన ప్రదర్శన జరిపింది.
రోడ్లు ఊడ్చి...
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: గూడూరులో సమైక్యవాదులు వీధులు చిమ్ముతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరి పట్టణంలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్‌లో మానవహారం నిర్వహించి ఆటాపాటా కార్యక్రమం చేపట్టారు. కోవూరులోని ఎన్‌జీఓ హోమ్‌లో మైనార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కావలి పట్టణంలో సమైక్యాంద్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రంకురోడ్డుపై ముగ్గువేసి గొబ్బెమ్మలను పెట్టి నిరసనను తెలిపారు.
సవాయి కట్టెల ప్రదర్శన
వైఎస్సార్ జిల్లా: పులివెందుల పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సవాయి కట్టెల ప్రదర్శన ఆకట్టుకుంది. బద్వేలులో ఆర్యవైశ్యులు భిక్షాటన చేశారు. ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే మిమ్మల్ని కూడా ఇలాగే ఊడుస్తామంటూ నినాదాలు చేస్తూ రోడ్లను శుభ్రపరిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కడప నగర పాలక సంస్థలో పర్యావరణ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తెలంగాణాకు చెందిన ఎల్.రవీంద్రనాథరెడ్డి ఒకరోజు నిరాహారదీక్ష చేశారు.
తుంగభద్ర జలాలతో తెలుగుతల్లికి అభిషేకం
అనంతపురం: ఉరవకొండలో ఉపాధ్యాయులు తుంగభద్ర జలాలతో తెలుగుతల్లికి అభిషేకం చేశారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాలంటూ ఉపాధ్యాయులు భజన చేసుకుంటూ రాయదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టాటా ఏస్ వాహనాలతో, ఉపాధ్యాయులు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం నగరంలో శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉత్తరాంధ్ర కళాజాతాల ప్రదర్శన
విజయనగరం: బొబ్బిలి పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత బేబీనాయన ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉత్తరాంధ్ర కళాజాతాల ప్రదర్శన జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో చీపురుపల్లి - సుభద్రాపురం ప్రధాన రహదారిలో రావివలస జంక్షన్ వద్ద గొర్రెలు, పశువులను తోలుకు వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉంచి ఆందోళన చేశారు. ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిక్షాలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురంలో జేఏసీ ఆధ్వర్యంలో పలువురు సమైక్యవాదులు శరీరానికి ఆకులు చుట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.
రోడ్డుపైనే వైద్యం
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో పీఎంపీ వైద్యులు రోడ్డుపైనే వైద్యం చేశారు. రాజమండ్రి వై జంక్షన్‌లో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. మామిడికుదురులో ఉద్యోగులు అర్ధనగ్నంగా వేపమండలు కట్టుకొని, డప్పుల మోత నడుమ ప్రదర్శన నిర్వహించారు. రెల్లి సంఘం ఆధ్వర్యంలో ఎల్‌ఐసీ బిల్డింగ్ నుంచి రాజుబాబు సెంటర్ వరకూ వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఆటో డ్రైవర్లు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు.
చెప్పులు కుడుతూ నిరసన
కర్నూలు: ఆదోనిలో సమైక్యవాదులు పాతబస్టాండ్ సర్కిల్‌లో చెప్పులు కుడుతూ నిరసన తెలియజేశారు. కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు కర్నూలు జిల్లా గౌండా కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు దిగ్విజయ్‌సింగ్ శవయాత్ర చేపట్టి విభజన నిర్ణయం పట్ల నిరసన తెలిపింది.
అంధ విద్యార్థుల దీక్ష
చిత్తూరు: తిరుపతిలో ఆదివారం యువ డాక్టర్లు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర విభజన విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ అనుసరిస్తున్న వైఖరిని స్వాగతించారు. తుడా సర్కిల్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో ఆదివారం అంధ విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మికులు శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. పీలేరులో బ్రాహ్మణ సమాజం సభ్యులు క్రాస్ రోడ్‌లో మానవహారం ఏర్పాటు చేసి వేద మంత్రాలు పఠించి సోనియా బుద్ధి మార్చాలని మొక్కుకున్నారు.
ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ
గుంటూరు: నగరంలో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. మాచర్ల, తెనాలి, వినుకొండ, గుంటూరు, సత్తెనపల్లి డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేపట్టారు. నరసరావుపేటలో జలదీక్ష, వినుకొండలో డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన సాగింది.
ఆసనాలతో నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం ైవె ఎస్‌ఆర్ జంక్షన్‌లో యోగాచార్య రామారావు ఆధ్వర్యంలో ఆసనాలు వేసి నిరసన తెలిపారు. వీరఘట్టంలో చీరపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ జంక్షన్‌లో సమైక్యాంధ్ర కోరుతూ ముస్లింలు నమాజ్ చేశారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి అక్కడే స్నానాలు చేశారు.
రుత్విక్కుల శాంతిహోమం
ప్రకాశం: అద్దంకి సీమ బ్రాహ్మణ సేవాసంఘం సభ్యులు సమైక్యాంధ్రను కోరుతూ రుత్విక్కులతో పాత బస్టాండులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శాంతిహోమం నిర్వహించారు.. దర్శిలో సమైక్యాంధ్రకు మద్దతుగా యాదవమహాసభ ఆధ్వర్యంలో గొర్రెలతో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ‘పంగనామాలు...దొంగడ్రామాలు’ నినాదంతో వినూత్న ప్రదర్శన చేశారు. పామూరులో టైలర్స్ రిలే దీక్షలు చేశారు.
క్రైస్తవుల మానవహారం
పశ్చిమగోదావరి: పెదఅమిరం ఏసుక్రీస్తు సహవాస సంఘ చర్చి ఆధ్వర్యంలో 500 మంది మానవహార ం నిర్మించి నిరసన తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాతబస్టాండు వరకు రైల్వే సీజనల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోటర్‌సైకిళ్ళ ర్యాలీ చేశారు. పాలకోడేరు మండలం కొండేపూడిలో పంటకాలువలో పడవపై నిలబడి రైతులు నిరసన తెలిపారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించి మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్లో టైర్లు అంటించి భారీ ఎత్తున నిరసన తెలిపారు.
ముస్లింల ప్రదర్శన
కృష్ణా: విజయవాడ వన్‌టౌన్ పంజాసెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు. తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైపాస్‌రోడ్డు సెంటర్‌లో వంటావార్పు నిర్వహించారు. పామర్రులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పామర్రులో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో రహదారిపై వంటావార్పు నిర్వహించారు.
‘సమైక్య’ ప్రకటన వచ్చేవరకు వెనక్కి తగ్గం
Published Sun, Sep 1 2013 11:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement