విద్యార్థులపై విరిగిన లాఠీ
నెల్లూరు(పొగతోట): స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో విద్యార్థులు తలోవైపు పరుగులు తీశారు. విద్యార్థులు మొదట నగరవీధుల మీదుగా ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాసేపు ప్రశాంతంగా ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను అధికారులకు వివరించేందుకు కలెక్టరేట్‌లోకి వెళుతామని, అనుమతివ్వాలని పోలీసులను కోరారు.
అందరూ లోనికి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వవ్యతిరేక నినాదాలను హోరెత్తించారు. ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో ఒకటో నగర ఇన్‌స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు పట్టుతప్పి కిందపడిపోయాడు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు. దొరికినవారిని దొరికినట్టుగా చితకబాదారు.
లాఠీ దెబ్బలకు తట్టుకోలేక తలోవైపు చెల్లాచెదురయ్యారు. ఎదురుతిరిగిన కొందరు విద్యార్థులు మరోమారు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి మరింత అదుపుతప్పుతుండటంతో విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కొందరిని బలవంతంగా జీపులో ఎక్కించారు. ఆ జీపు ముందుకు కదలకుండా ఇంకొందరు అడ్డుకున్నారు. వారిని పక్కకు తీయడానికి పోలీసులు శ్రమించాల్సివచ్చింది. చివరకు బలవంతంగా వారిని పక్కకు లాగిపడేశారు. తోపులాట, అరెస్ట్‌ల సమయంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో పాటు పలువురు విద్యార్థులను ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు జి.సుధీర్, పి.కిరణ్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. గత ఏడాదికి సంబందించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15.93 కోట్లు ఉన్నాయన్నారు.
వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 72ను సవరించడంతో పాటు స్థానికతపై విద్యార్థులకు స్పష్టత ఇవ్వాలన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వెంటనే ప్రాక్టికల్స్ నిర్వహించాలన్నారు. వీఎస్‌యూ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వి. ప్రసాద్, ఎంవి రమణ, ఎన్ రవి, రాము, రవీంద్ర, బాబురావు, రాజశేఖర్, గణేష్, సాయి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.