ప్రమాణాల్లేని ప్రభుత్వ పాఠశాలలు
విద్యార్థులకు మరుగుదొడ్లూ కరువే
ఆట స్థలం లేక శారీరక దృఢత్వంపై ప్రభావం
గ్రంథాలయాల ఏర్పాటూ అంతంతే..
తేటతెల్లం చేసిన విద్యా శాఖ నివేదిక
సాక్షి ప్రతినిధి, కర్నూలు : మరో 20 రోజుల్లో బడి గంట మోగనుంది. విద్యార్థులకు యథావిధిగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. ఆడుకునేందుకు ఆట స్థలం.. మరుగుదొడ్లు.. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఇప్పటికీ ఎన్నో పాఠశాలల్లో నెలకొంది. మౌళిక సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం 4,095 ఉన్నాయి. వీటిలో 6,74,077 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
వీరంతా ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తాజాగా జిల్లా విద్యా శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదిక అద్దం పడుతోంది. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని మొత్తం పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు 2 కాగా.. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 219. ఇక స్థానిక సంస్థల పరిధిలో(మునిసిపల్, జెడ్పీ) 2,578 పాఠశాలలు ఉండగా.. 173 ఎయిడెడ్, 1123 అన్-ఎయిడెడ్ సూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు కూడా లేకపోవడం గమనార్హం. మానసిక విజ్ఞానంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఆటలకూ విద్యార్థులు దూరమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కలవరపెడుతున్న డ్రాపౌట్స్
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం ఒక సమస్య కాగా.. బడిమానేస్తున్న విద్యార్థుల సంఖ్య మరో సమస్య. ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రైమరీ స్కూళ్లలో డ్రాపౌట్ శాతం 11.71 కాగా.. ఎలిమెంటరీ లెవెల్‌లో 8.17 శాతంగా ఉంది. ఇక సెకండరీ స్థాయిలో బడిమానేస్తున్న విద్యార్థుల శాతం 5.7గా ఉంది.
ప్రభుత్వ పాఠశాలలపై శీతకన్ను
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన వసతి ఉన్నప్పటికీ తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడం లేదు. ప్రైవేట్ సంస్థల లాబీయింగ్‌కు తలొగ్గిన ప్రభుత్వం.. ఉద్దేశపూర్వకంగానే తన ఆధీనంలోని పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోంది.
- కరుణానిధి మూర్తి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు
బడికి వేళాయె.. తీరు మారదాయె!
Published Fri, May 29 2015 4:42 AM | Last Updated on Tue, Aug 28 2018 5:28 PM
Advertisement
Advertisement