పీడిస్తున్న ‘సికిల్‌సెల్’ | Symptoms of anemia tribal area people | Sakshi
Sakshi News home page

పీడిస్తున్న ‘సికిల్‌సెల్’

Published Wed, Jul 29 2015 3:27 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

పీడిస్తున్న ‘సికిల్‌సెల్’

పీడిస్తున్న ‘సికిల్‌సెల్’

- 35 మందికి ఎనీమియా లక్షణాలు
- వైద్య నిపుణుల అధ్యయనం
- సర్వేకు రెండు నెలల్లో కార్యాచరణ
పాడేరు:
గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా కేసులను గుర్తించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దీని నివారణకు మందులు లేవు. రోగులకు అత్యవసరమైనప్పుడు రక్తం ఎక్కించి వారి జీవన ప్రమాణం పెంచగలుగుతున్నారు. మన్యంలో ఈ వ్యాధి వల్ల చాలా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏజెన్సీలో ప్రస్తుతం 35 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.

కాల పరిమితి మేరకు వీరి రక్తహీనత స్థాయిని పరిశీలించి పాడేరు, అరకు, చింతపల్లి ఆస్పత్రులలోని రక్త నిల్వ కేంద్రాల ద్వారా అవసరం అయినప్పుడు రక్తం ఎక్కిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత వల్ల అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గర్భిణులు, బాలింతలు ఈ లక్షణాలతో సతమతమవుతున్నా రు. ఈ కారణంగా తరచూ మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

మన్యంలో పౌష్టికాహార లోపం కారణంగా తొమ్మిదేళ్లలోపు చిన్నారుల్లోనూ రక్తహీనత ఎక్కువగా ఉంటోంది. బాధితులకు అత్యవసరమైన ప్పుడు ఆస్పత్రిలో రక్తం ఎక్కించడంతోపాటు ఐరన్ మాత్రల పంపిణీ, ఇతర వైద్యసేవలను అందిస్తున్నారు. అయినప్పటికీ కొందరు కోలుకోలేకపోతున్నారు. దీంతో మన్యం నుంచి రక్తహీనతతో బాధపడుతున్న రోగులను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ కూడా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో వైద్య నిపుణులు దీనిపై అధ్యయనం చేసి ఎనీమియాతో బాధపడుతున్న రోగుల్లో కొడవలి ఆకారంగా ఉండే ఎర్రరక్తకణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇది సికిల్‌సెల్ ఎనీమియా అని, వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధిగా గుర్తించారు.

ఏజెన్సీలో రక్తహీనతతో ఉన్న వారిని  గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటా సర్వే నిర్వహించనుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఆరు జిల్లాల ఏడీఎంహెచ్‌వోలతో ఈ సర్వేపై కార్యచరణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గిరిజన ప్రాంతాల్లో ఇందుకు ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఎనీమియా రోగులకు సాలిబిలిటీ టెస్ట్ నిర్వహించడం, సర్వే నిర్వహించడంపై డాక్టర్ల బృందాలకు శిక్షణను ఇవ్వనున్నారు. ఎపిడమిక్ అనంతరం ఏజెన్సీలో రెండు నెలలపాటు ఈ సర్వే చేపట్టనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement