స్థానిక పన్ను.. గుడ్డుపైనా కన్ను
కోడిగుడ్డుపై 10 పైసలు పన్ను వేయూలంటూ సర్పంచ్‌లకు పాఠాలు
పంచాయతీరాజ్ చట్టం ఈ అవకాశం కల్పించిందంటున్న శిక్షకులు
తద్వారా ఆదాయూన్ని పెంచుకోవాలంటూ సూచన
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ :
‘ప్రియమైన కొత్త సర్పంచుల్లారా.. మీ ఊరి ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా.. అరుుతే మీకో మంచి అవకాశం. కోడిగుడ్డిపై 10 పైసల చొప్పున పన్ను వేయండి. లక్షలాది రూపాయల ఆదాయూన్ని సమకూర్చుకోండి. మీ ఊరిని బాగు చేసుకోండి. సిబ్బందికి త్వరగా జీతాలు ఇచ్చేయండి. కరెంటు బిల్లులు కూడా సకాలంలో కట్టేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఊళ్లోకి వెళ్లిన వెంటనే ఈ పని మొదలు పెట్టేయండి.
కోడిగుడ్డుపై పన్నా.. ఇదెలా సాధ్యం.. ప్రజలు ఊరుకుంటారా అనుకుంటున్నారా. ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా ఇది సాధ్యమే. ఎందుకంటే సాక్షాత్తు పంచాయతీరాజ్ చట్టమే మీకు ఆ హక్కు కల్పించింది’ అంటూ సర్పంచులకు నూరిపోస్తున్నారు. ‘ఇందుకు మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎంచక్కా గ్రామసభ పెట్టండి. కోడిగుడ్డుపై 10 పైసలు పన్ను వేస్తున్నట్టు తీర్మానం చేసేయండి. అంతే..’ అంటున్నారు.
ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్!
‘ఇదేదో బాగుందే.. గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకటైనా కోడి ఉంటుంది. కనీసం నెలకు 20 గుడ్లు పెడుతుంది. తన జీవిత కాలంలో వందలాది గుడ్లు పెడుతుంది. వాటిపై పన్ను వేస్తే నిండా ఆదాయమే..’ అనుకుంటున్నారా. ఇక్కడో ట్విస్ట్ ఉంది. పన్ను వేయాల్సింది ప్రజలు ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్లు పెట్టే గుడ్లపై కాదు. గ్రామాల్లో ఉండే కోళ్ల ఫారాల్లోని కోళ్లు పెట్టే గుడ్లుపై మాత్రమే పన్ను వేసే అవకాశం ఉంది.
చెబుతున్నదెవరంటే...
ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్‌లో సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన తరగతుల్లో గ్రామ పంచాయతీలు ఆదా య మార్గాలను పెంచుకోవడం ఎలా అనే అంశంపై సర్పంచ్‌లకు బోధించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ అభివృద్ధి అకాడమీ నుంచి శిక్షకులుగా హాజరైన రిసోర్సుపర్సన్లు సీహెచ్ ప్రసన్నాంజనేయులు, ఎస్వీ సుబ్రహ్మణ్యం తదితరులు కోళ్లఫారాల్లో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్యను లెక్కగట్టి ప్రతి గుడ్డుకు 10పైసల చొప్పున పన్ను వేసి ఆదాయం ఎలా పెంచుకోవచ్చనే విషయూలను వివరించారు.
తొలుత సర్పంచ్‌లు ఆశ్చర్యపోరుునా పంచాయతీరాజ్ చట్టంలో ఈ విషయం ఉందని, ఇది ప్రభుత్వం కల్పించిన అవకాశమని రిసోర్సుపర్సన్లు చెప్పటంతో మంచి ఆదాయ మార్గం కనిపించిందని సంబరపడ్డారు. అరుుతే, దీనిని ఆచరణలో పెట్టగలమా అని కొం దరు ప్రశ్నించారు. దీనికి శిక్షకులు బదులిస్తూ.. దేశంలో కొన్ని వస్తువుల అమ్మకం, సేవలపై కేంద్రం ప్రభుత్వం, మరికొన్ని వస్తువులు, సేవలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేసి ఎలా ఆదాయం పొందుతున్నాయో వివరించారు. స్థానిక సంస్థలకు కూడా కొంత ఆదాయా న్ని సమకూర్చాలనే ఉద్దేశంతో కొన్ని వస్తువుల, సేవలపై పన్ను వేసుకునే అధికారాన్ని పంచాయతీరాజ్ చట్టం కల్పించిందని వివరించారు.
ఈ జాబితాలో కోళ్ల ఫారాలు. ఇటుక బట్టీలు, కాటా రుసుం వంటివి ఉన్నాయని చెప్పారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ కోళ్ల ఫారాలపై పన్ను వేయకుండా వదిలేశాయని తెలిపారు. ఇప్పుడు వీటిపై పంచాయతీలు అమ్మ కం పన్ను వసూలు చేసి ఆదాయం పెంచుకోవచ్చని చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్టం పుణ్యమా అని కోస్తాంధ్రలో అనేక పంచాయతీలకు మంచి ఆదాయ మార్గం దొరికిందని పేర్కొన్నారు. శిక్షణ తరగతులను డీఎల్‌పీవో రాజ్యలక్ష్మి పరిశీలించగా, ఏలూరు ఇన్‌చార్జి ఎంపీడీవో ఎంవీ అప్పారావు, సూపరింటెండెంట్ ఎస్‌టీవీ మురళీధర్ పర్యవేక్షించారు. ద్వారకాతిరుమల, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లు మండలాలకు చెందిన సర్పంచ్‌లు హాజరయ్యారు.