సాక్షి, హైదరాబాద్: తెలుగువారిని విభజించే హక్కు హిందీ వారికి ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా బుధవారం శాసనమండలిలో ఆమె మాట్లాడారు. కేంద్రం తెలుగు ప్రజలను మోసగిస్తూ వారి చెవుల్లో పూలు పెడుతోందని, అందుకే తాను చెవిలో పూలు పెట్టుకొని బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బిల్లులో రాయలసీమ జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అందరిదీ అని, మీదెక్కడుందని ప్రశ్నించారు. దీంతో ఎంఐఎం ఎమ్మెల్సీ రజ్వీ కల్పించుకొని అభివృద్ధి ఏ ఒక్కరి కాపీరైట్ కాదన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని, సవరణలు తప్పనిసరిగా చేయాలని అన్నారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను, తెలుగుతల్లిని విడగొట్టవద్దని అన్నారు.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో పార్టీలు 2004, 2009లో పొత్తు పెట్టుకున్నాయంటే తెలంగాణకు అంగీకరించినట్టేనని, అలాంటిది ఇపుడు ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దని అన్నారు.
- సోవియేట్ ముక్కలయ్యాక రష్యా పరిస్థితి ఘోరంగా ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. చిన్న రాష్ట్రాలతో దేశ ఐక్యతకు భంగం కలుగుతుందన్నారు.
- సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలు నడిపిస్తున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉనికి కోసమే పాల్గొన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ అన్నారు. విభజనతో రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ.. ఇలా అడ్డగోలుగా విభజన చేసేటట్టయితే శాసనసభ, శాసనమండలి ఎందుకని ప్రశ్నించారు.
- మనోభావాల పేరుతో విభజిస్తే చాలా రాష్ట్రాలను విడదీయాల్సి వస్తుందని, అది దేశానికే ప్రమాదకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ అన్నారు.
- ఉమ్మడి రాజధాని ఐదేళ్లలోపే ఉంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీశ్వరరెడ్డి అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించాలన్నారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవపున్నయ్య మాట్లాడుతూ రాష్ట్రం విడిపోదని, ఇరు ప్రాంతాలకు చెందిన దేవుళ్లూ సమైక్యాన్నే కోరుకుంటున్నారని చెప్పారు.
- కేంద్రం ప్రజాభిప్రాయానికి తావు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అన్నారు.
- ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రి మాట్లాడుతూ.. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని, విభజిస్తే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు.
- మండలిలో వివిధ అంశాలపై సభ్యులు 1,157 సవరణలు ప్రతిపాదించారు.