రాజీనామా చేసేందుకు వచ్చిన కౌన్సిలర్లు
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : అంతర్గత పోరు.. కుమ్ములాటలు ప్రొద్దుటూరు తెలుగుదేశం నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గతంలో పలుమార్లు అధికార టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి బట్టబయలయ్యాయి. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వర్గపోరు తాజాగా రాజీనామాల వరకు వెళ్లింది. ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తీరును నిరసిస్తూ సోమవారం మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు తెలుగుదేశంపై తిరుగుబాటు చేస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. వీఎస్ ముక్తియార్ నేతృత్వంలో ఆయన ఇంటి వద్ద నుంచి కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైన జనంతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. దారి వెంట వారు వరదకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదనుపార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, వరద హఠావో.. టీడీపీ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజీనామా చేయడానికి వెళ్తున్న కౌన్సిలర్ల వెంట పెద్ద ఎత్తున జనం రావడంతో మున్సిపల్ కార్యాలయం బయట పోలీసులు వారిని అడ్డుకున్నారు. కౌన్సిలర్లు మాత్రమే లోపలికి వెళ్లాలని డీఎస్పీ నాయకులకు సూచించారు. డీఎస్పీ సూచన మేరకు కౌన్సిలర్లు, ప్రధాన నాయకులు కార్యాలయంలోకి వెళ్లారు. కాగా ముందుగా 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా చివరి నిమిషంలో 36వ వార్డు కౌన్సిలర్ మార్తల రామమునిరెడ్డి కూడా రాజీనామా చేశారు. అధికార పార్టీ కౌన్సిలర్ల రాజీనామా విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా రాజీనామా చేయడానికి వెళ్తున్న సమయంలో కూడా కౌన్సిలర్లు బలప్రదర్శనకు దిగడం విశేషం.
వరద నియంతలా వ్యవహరిస్తున్నారు
రాజీనామా అనంతరం వీఎస్ ముక్తియార్ మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటిలో జరిగే ప్రతి పనిలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇన్‌చార్జి పేరుతో జోక్యం చేసుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారాడన్నారు. అందుకు నిరసనగా కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు రాజీనామా చేశారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన వరద స్వార్థం కోసం పని చేస్తున్నారని చెప్పారు. పార్టీలో పూర్వం నుంచి ఉన్న కౌన్సిలర్లు, నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అందుకు నిరసనగా వేల మందితో కలిసి రాజీనామాలను సమర్పించామన్నారు. కౌన్సిలర్ పదవులకు మాత్రమే రాజీనామాలు చేశామని, పార్టీకి కాదన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. వరదరాజులరెడ్డిపై సీఎంకు, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి, జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామన్నారు. అధిష్టానం సంప్రదింపులు జరిపి వరదరాజులరెడ్డిపై చర్యలు తీసుకుంటే తప్ప రాజీనామాలను ఉపసంహరించుకోమన్నారు. రాజీనామాలు ఆమోదించాలని అధికారులపై ఒత్తిడి తెస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబివుల్లా మాట్లాడుతూ పార్టీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమను టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో పార్టీ పరువు తీస్తున్నారని తెలిపారు. తమ వార్డుల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎలాంటి సమాచారం అందించలేదన్నారు. పార్టీకి వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ టీడీపీని బలహీన పరుస్తున్నాడని తెలిపారు.ఇలాంటి నాయకుడితో పార్టీకి నష్టం ఉందని అధిష్టానం గుర్తించాలన్నారు. వరదను టీడీపీ నుంచి తప్పించి పార్టీని కాపాడాలన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చట్టప్రకారం నడుచుకుంటాం
22 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డికి అందజేశారు. రాజీనామాలు తీసుకున్న అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఒక కౌన్సిలర్ రాజీనామా చేస్తే సెక్షన్ 55 ప్రకారం ఏం చేయాలో తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు.
రాజీనామా లేఖలో ఏముందంటే..
కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖల్లో ఒకే సారాంశం ఉంది. ఈ నెల 29న టీడీపీ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి 23, 24, 25, 26 వార్డుల్లో నగరదర్శిని పేరుతో మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి వార్డు కౌన్సిలర్లను అవమానించినందుకు, ఇతర వార్డుల్లో కూడా వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇన్‌చార్జి ఏకపక్షంగా, నియంతృత్వంగా కార్యక్రమాలను చేస్తున్నందుకు నిరసనగా కౌన్సిలర్ పదవికి రాజీ నామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించవలసినదిగా కోరుచున్నాను. అని రాసి ఉంది.
మున్సిపల్ కార్యాలయం సమీపంలో భారీ బందోబస్తు
టీడీపీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారన్న సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ రోడ్డులోని హెడ్‌పోస్టాఫీసు సమీపంలోని బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న జనాలను పంపించారు. కౌన్సిలర్లు, నాయకులు జనంతో కలిసి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కౌన్సిలర్లను మాత్రమే అనుమతించాల్సి ఉందని, అయినా ముఖ్య నాయకులను కూడా అనుమతిస్తున్నామని చెప్పారు. లేదంటే నాయకులు కూడా బయటనే ఉండాల్సి వస్తుందని డీఎస్పీ చెప్పారు. దీంతో వారి వెంట వచ్చిన ప్రజలందరూ మున్సిపల్ కార్యాలయం బయటనే ఉండాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment