కదిరి: నకిలీ డీడీల కుంభకోణం కేసులో అనంతపురం జిల్లా కదిరికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో శిక్ష పడిన మహమ్మద్ షాకీర్‌తో పాటు మిగిలిన ముగ్గురికి కూడా బెయిల్ లభించింది. ఒక్కొక్కరు రూ.లక్ష విలువ చేసే ష్యూరిటీలను ఇద్దరి ద్వారా ఇప్పించాలని ఆదేశిస్తూ వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరంతా చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.8.29 కోట్ల విలువ చేసే 100 డీడీల స్కాంలో కందికుంటకు రెండు రోజుల క్రితం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.13 లక్షల జరిమాన విధించిన విషయం తెలిసిందే. కందికుంటకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, కొందరు టీడీపీ కార్యకర్తలు కదిరిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.