సండ్రకు షరతులతో బెయిల్
పాస్‌పోర్టు అప్పగించాలని, నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని ఆదేశం
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా: సండ్ర
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై పన్నిన కుట్ర రాజకీయాలపై న్యాయపరంగా పోరాడి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. బెయిల్ మంజూరు కావడంతో మంగళవారం చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని ఆ పార్టీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు నిరాకరించడం వల్లే కేసులో ఇరికించారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపై బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు చెప్పారు