వైఎస్సార్ కాంగ్రెస్ను నేరుగా ఎదుర్కోలేని తెలుగుదేశం
ఎంపీలను హస్తిన పెద్దలతో కలిపిస్తున్న కుట్రబాబు
సీబీఐ, ఈడీ, సీవీసీలను కలిసిన ఎంపీలు
జగన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని విజ్ఞప్తులు
అనుకున్నట్లే అవుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేని తెలుగుదేశం పార్టీ మరోసారి దొడ్డిదారిలో బుసకొడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ ఎంపీలు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తోందనగానే తమదైన శైలిలో పావులు కదిపే తెలుగుదేశం నాయకులు మళ్లీ అదే పాతపాట మొదలుపెట్టారు. సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను కలిసి.. వైఎస్ జగన్మోహన రెడ్డిపై విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు!!
తొలుత నేరుగా చంద్రబాబే హస్తినబాట పట్టాలని భావించినా, తర్వాత అసలు ఆయన ఢిల్లీ పర్యటన ఎందుకోనన్న ప్రశ్నలు గట్టిగా తలెత్తడం, పలువురు నాయకులు కూడా దుమ్మెత్తి పోయడంతో తన బస్సుయాత్రను కూడా అర్ధంతరంగా ముగించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత.. మళ్లీ ఎక్కడ తన కుట్రలు బయటపడిపోతాయోనని తాను వెళ్లకుండా తన పార్టీ ఎంపీలతోనే రాజకీయం నడిపించడం మొదలు పెట్టేశారు.
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులను మంగళవారం కలవడానికి టీడీపీ ఎంపీలు అపాయింట్‌మెంట్లు కోరారు. వాస్తవానికి వీరు అపాయింట్‌మెంట్లు కోరడానికి ముందే చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో ఫోన్‌లో మాట్లాడి తమ వారికి అపాయింట్‌మెంట్లను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రాన్ని విభజించినా అభ్యంతరం లేదని, అయితే ఎన్నికల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌కు బెయిల్ రాకుండా చూడాలని విన్నవించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీ ఇప్పటి వరకు కొనసాగుతున్న విధంగానే సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.జగన్‌కు బెయిల్ వస్తే టీడీపీ పరిస్థితి సరేసరి, కాంగ్రెస్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదని చంద్రబాబు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాను ఢిల్లీకి వెళ్లకుండా టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావును ముందుపెట్టి జగన్ బెయిల్‌ను అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఇక టీడీపీ నాయకుల కుట్రకోణం మంగళవారం నాడు స్పష్టంగా బయట పడిపోయింది. లోక్సభ సభ్యులు నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణరావు, రమేష్ రాథోడ్, రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, సీఎం రమేష్ తదితరులు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను మంగళవారం కలిశారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆయనతో మంతనాలు సాగించిన ఈ బృందం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర విజిలెన్స్ కమిషన్లనూ కలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నందువల్లే జగన్కు బెయిల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని, అందుకే చార్జిషీట్లన్నీ దాఖలు చేస్తున్నారని ఎంపీలు వాపోయారు. జగన్కు బెయిల్ వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోందని వాళ్లు సరికొత్త భాష్యాలు చెప్పారు.
టీడీపీ దొడ్డిదారి ప్రయత్నాలు షురూ!
Published Tue, Sep 17 2013 9:00 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement