అక్రమాల వీరుడు.. మా వీరభద్రుడు | Tdp Leader Veerabhadra Goud Involve Many Scams | Sakshi
Sakshi News home page

అక్రమాల వీరుడు.. మా వీరభద్రుడు

Published Sat, Mar 9 2019 12:09 PM | Last Updated on Sun, Mar 10 2019 8:01 PM

Tdp Leader Veerabhadra Goud Involve Many Scams - Sakshi

 సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఆలూరు.. ఏటా కరువు పలకరించే ప్రాంతం. జిల్లాకు సరిహద్దు నియోజకవర్గం. ఏళ్లనాటి సమస్యలు.. తడారిన గొంతులు.. ఎండిన భూములు.. నిత్యం వలసలు. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వ అండతో పెత్తనం చెలాయిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా.. తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాల వీరుడిగా అవతారమెత్తి.. అక్రమార్జనను భద్రంగా దాచుకుంటున్నారు. సంక్షేమ పథకం ఏదైనా తనకు పర్సెంటేజీలు ఇవ్వాల్సిందే అంటారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ.. కల్తీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. మరుగుదొడ్లు నిధులు మింగేస్తూ.. బ్యాంకులకు టోకరా వేస్తూ.. ఉద్యోగాలు అమ్ముకుంటూ.. ఇలా ఎన్నో దందాలు చేస్తున్న వీరభద్రగౌడ్‌ అవినీతి బాగోతంపై ‘సాక్షి’ ఫోకస్‌. 

ఆయన కేవలం టీడీపీ ఇన్‌చార్జ్‌. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అవినీతి దందాకు తెరలేపారు. అభివృద్ధి నిధులు మింగేస్తూ.. సంక్షేమ పథకాలను ఆరగిస్తూ అక్రమ ఆదాయార్జనే ధ్యేయంగా వీరభద్రగౌడ్‌ సాగిపోతున్నారు. నీరు–చెట్టు పనుల కోసం వాగులు, వంకలు తిరిగిన అధికార పార్టీ నేతలు... కనీసం ఆ వాగులు, వంకల్లో నీళ్లు నిలిపేందుకు మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉపాధి అవకాశాలు లేక చివరకు అంగన్‌వాడీ పోస్టుల కోసం వందల మంది పోటీ పడితే.... ఈ పోటీని ఆసరాగా చేసుకుని పోస్టులను అంగట్లో అమ్ముకున్న చరిత్ర ఆయనది.


ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ వీరభద్ర గౌడ్‌కు చెందిన జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ ఫ్యాక్టరీ

కర్ణాటకకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడికి రూ.20 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి... అక్కడి నుంచి కల్తీ మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో అమాయక జనానికి కల్తీ మద్యాన్ని అలవాటు చేసి ఆరోగ్యాలతో అధికారపార్టీ నేతలు ఆటలాడుకుంటున్నారు. బ్యాంకుల నుంచి భారీగా రుణం తీసుకుని అధికారం అండతో చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో ఉండి ఇన్‌చార్జ్‌గా అధికారాలు చెలాయించిన వీరభద్రగౌడ్‌ నియోజకవర్గానికి ఒక్క మంచి పనీ చేయలేదని జనం ముక్త కంఠంతో చెబుతున్నారు.    

అవినీతి ‘మేటలు’  


విఘ్నేశ్వర క్వారీలో కొండను తొలిచేసిన దృశ్యం (ఫైల్‌)
 

రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కావడంతో సులభంగా రాత్రి సమయాల్లో ఇసుకను పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ మొత్తం ఇసుక దందాను అధికారపార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. వీరికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పక్క రాష్ట్రానికి ఇసుక తరలిపోతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హొళగుంద మండలం మార్లమడికి, గూళ్యం వేదావతి నది నుంచి ఇసుకను తవ్వి కర్ణాటక ప్రాంతమైన బెంగళూరు, బళ్లారి జిల్లాలకు తరలించారు. ఈ విధంగా మొత్తం రూ.20 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అధికారపార్టీ నేతలకు రూ.6 కోట్ల మేర అందినట్టు విమర్శలు ఉన్నాయి.

అంతటా కమిషన్ల పర్వం
- పవన విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆలూరు నియోజకవర్గం అనువైన ప్రాంతంగా  ఉంది. గాలి వీచే తీవ్రత ఎక్కువగా ఉండటంతో పవన విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, ఇక్కడ పనులు చేసుకోవాలంటే తమకు పర్సెంటేజీలతో పాటు పనుల్లో సబ్‌ కాంట్రాక్టు కూడా ఇవ్వాలని అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు.  
- పవన విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంలో భారీగా బెడ్డు వేసేందుకు ఇసుక అవసరం అవుతుంది. ఈ ఇసుక సరఫరా కాంట్రాక్టును కూడా అధికారపార్టీ నేతలే తీసుకున్నారు.  అనుమతి లేకుండా చెరువులు, వంకల నుంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. 
- పవన విద్యుత్‌ ప్లాంటు నెలకొల్పాలని ముందుకు వచ్చిన ప్రైవేటు విద్యుత్‌ నిర్మాణ సంస్థల నుంచి పనులు చేసుకునేందుకు భారీగా మాముళ్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  
- ఆయా కంపెనీలు భూములను కొనుగోలు చేసే సమయంలో కూడా అధికారపార్టీ నేతలే మధ్యవర్తిగా ఉండి.... రైతులకు తక్కువ ధర చెప్పి కంపెనీ నుంచి అధిక ధర తీసుకుని భారీగా ఆదాయం ఆర్జించినట్టు తెలుస్తోంది.  
- రూర్బన్‌ పథకం కింద మంజూరైన రూ.117 కోట్ల పనులన్నీ పాత పనులనే కొత్తగా చేసినట్టు చూపుతూ నిధులను కాజేస్తున్నారు.  
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వచ్చిన రూ.6 కోట్ల పనుల్లోనూ చేతివాటం ప్రదర్శించారు.  
- వాటర్‌ గ్రిడ్‌ కింద మంజూరైన రూ. 14 కోట్ల పనులను కూడా కమీషన్‌ పుచ్చుకొని అప్పగించినట్టు తెలుస్తోంది.  
- అంగన్‌వాడీ పోస్టులను సైతం వదలకుండా అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాదాపు 40 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకుగానూ ఒక్కో పోస్టుకు రూ. 3 లక్షల వరకు తీసుకున్నారు. అంటే రూ. 1.20 కోట్ల మేర అంగన్‌వాడీ పోస్టులకే సంపాదించారన్న మాట. ఇక అంగన్‌వాడీ ఆయా పోస్టులు 50 మందికి గాను రూ. 50 వేల రూపాయల చొప్పున రూ.25 లక్షలు ఆర్జించారు.    

 ఊరూరా గౌడు గారి బెల్ట్‌షాప్‌లు 
ఆలూరు అధికారపార్టీ ముఖ్యనేత తన పేరుతో కాకుండా బినామీ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. ఇక్క డ నుంచి గ్రామాల్లో బెల్టు షాపునకు సరఫరా చేస్తున్నారు. ఇందంతా ఎక్సైజ్‌ శాఖ కనుసన్నుల్లో నడుస్తోంది. దేవరలకు, జాతర్ల సమయంలో ఇక్కడి నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవ్వాలని నిబంధనలు పెట్టి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా కర్ణాటక నుంచి కల్తీ మద్యం తెచ్చి మరీ ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  సీసీఐ అధికారులను లొంగతీసుకొని మొదటి సారిగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గడిచిన రెండేళ్ల నుంచి ఇక్కడ పత్తి కొనుగోలు విక్రయాలు లేవని చెప్పడంతో వివిధ గ్రామాలలోని రైతులు వ్యయప్రయాసలకు గురవుతూ ఆదోని యార్డుకు తరలిస్తున్నారు. ఇందులోనూ తమకు సంబంధించిన అంగళ్లకు మాత్రమే పత్తిని విక్రయించేలా జాగ్రత్తలు చేపట్టారు.
     తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల టెండర్ల పనులకు తమ సమీప బంధువులను పంపిస్తున్నారు. పనులు దక్కకపోతే కాల్వపై పర్యవేక్షణ చేసి పనుల్లో నాణ్యత లేదని ఆరోపణలు చేస్తారు. ఈ పనులలో కోట్లాది రూపాయలు దండుకోవడం కొనసాగింది. గుంతకల్లు సబ్‌ డివిజన్‌ పరిధిలో జరిగే రైల్వే పనుల్లో సిండికేట్‌  కొనసాగుతోంది.  

 నీరు చెట్టు... పనులన్నీ తీసికట్టు! 


హెబ్బటం వంకలో నీరు చెట్టు పనులు (ఫైల్‌)  


ఆలూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.50 కోట్ల మేర నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ పనులను కాంట్రాక్టరుతో పాటు అధికారపార్టీ నేతలకు అప్పగించారు. సుమారు 18 నుంచి 20 శాతం వరకూ కమీషన్‌ తీసుకుని పనులు అప్పగించారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కడో మూలనున్న వాగులు, వంకలను సైతం గుర్తించి నీరు–చెట్టు పథకం కింద నిధులు మంజూరు చేయించుకున్నారు. అయితే, గతంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులను సైతం తాజాగా ఈ పథకం కింద చేసినట్టు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా భారీగా కమీషన్‌ దండుకోవడంతో పనులు జరిగాయా? లేదా అన్నది కూడా పరిశీలించిన దాఖలాలు లేవు.

ఇక చెక్‌డ్యామ్‌లు   నాసిరకంగా నిర్మించి నిధులు మింగేశారు. పైపైగా సిమెంటు పూత పూసి... మొత్తం ఇసుక బస్తాలతో నింపివేశారు. పనులను పరిశీలించాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. మరికొందరు అధికారపార్టీ నేతలు ముందడుగు వేసి... పాత చెక్‌డ్యాంలకు పైపై మెరుగులు దిద్ది నిధులు దిగమింగారు. ఇక నీరు–చెట్టు కింద పనులు చేసిన సమయంలో తీసిన మట్టిని... ఆ చెరువుల చుట్టూ ఆనకట్ట పదిలంగా ఉండేటట్లు తరలించాల్సి ఉంటుంది. అయితే, పూడిక మట్టిని సైతం ట్రాక్టర్‌కు కొంత మొత్తం చొప్పున దండుకున్నారు.

ప్రధానంగా హాలహర్వి మండలం చింతకుంట, బిలేహాలు, కామినేహాలు, మెదేహాలు, ఆస్పరి మండలంలో వెంగళాయదొడ్డి, నగరూరు, ఆలూరు మండలంలోని మొలగవల్లి, హత్తిబెళగల్, ఆలూరు గ్రామాల చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రతి రోజు వేలాది రూపాయలు ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి.   

దేవాలయ భూములు అన్యాక్రాంతం 
ఆలయాల్లో దీప ధూప నైవేద్యం కోసం ఏర్పాటు చేసిన మాన్యం భూములు సైతం ఆక్రమించుకొని కౌలు లీజు పేరుతో కొన్నేళ్లుగా భోంచేస్తున్నారు. నిరుపేదలకు (మంగలి, చాకలి) దక్కాల్సిన మాన్యం భూములు దక్కకుండా కాజేసిన వైనం హొళగుంద మండలం హొన్నూరు క్యాంపులో కొనసాగుతుంది. 22 సర్వే నెంబరులో 54.57  ఎకరాల భూమిని వివిధ తూర్పు జిల్లాలకు చెందిన వేణుగోపాల్, బాబు, కృష్టా తదితరులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు.

సారవంతమైన భూములు గతంలో బావి మరమ్మతులు, మంగలి, చాకలి ఇనాంలకు ఉంచిన వాటిని లీజుపేరుతో దగా చేస్తున్నారు. ఇదంతా పచ్చనేత అండతోనే జరుగుతోంది. హాలహర్వి మండలం చింత కుంట గ్రామంలో 336ఏ సర్వే నెంబరులో 14.80 ఎకరాల రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన భూమి కూడా ఆ గ్రామ అధికారపార్టీ నేతల స్వాధీనంలోనే ఉంది.  

మరుగుదొడ్లలోనూ అవినీతి కంపు.. 
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో సుమారు 15 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల పనులను థర్డ్‌ పార్టీలకు అప్పజెప్పి నిధులు కాజేశారు. హొళగుంద మండలం వృద్ధాశ్రమం పేరున కోట్లాది రూపాయలు మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేశారు. అలాగే నిట్రవట్టి గ్రామంలో 300 వ్యక్తి గత మరుగుదొడ్లు నిర్మించకుండానే వీరభద్రగౌడ్‌ అనుచరుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ బసప్ప దాదాపు రూ. 30 లక్షలు లబ్ధిదారుల తెలియకుండానే నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారులు కూడా అధికారపార్టీ నేతలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా మరుగుదొడ్లలోనూ అమ్యామ్యాలు తీసుకుంటూ అవినీతి కంపు లేపారనే ఆరోపణలు ఉన్నాయి.  

బ్యాంకులకు టోకరా...! 
ఆదోనిలో వీరభద్రగౌడ్‌ కుటుంబానికి పత్తి మిల్లు ఉంది. ఈ మిల్లు కోసం కెనరా బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకున్నారు. అయితే, ఈ రుణం చెల్లించకుండా బ్యాంకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. అధికారపార్టీలో ఉన్నామనే అహంకారంతో బ్యాంకులకు రుణం చెల్లించకుండా దబాయించడమూ చేశారు. అయితే, ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సుమారు రూ.150 కోట్ల మేర రుణం చెల్లించకపోతే.... తనాఖాగా ఉంచిన ఆస్తిని వేలం వేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటికప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి... వేలం వేయకుండా తాత్కాలికంగా కొంచెం రుణం చెల్లించి పరువు నిలుపుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

చేయి తడిపితేనే గృహం.. అనర్హులకే రుణం..
- షెడ్యూల్డ్‌ కులాల, తెగల, వెనుకబడిన, ముస్లిం మైనార్టీ, కాపు రుణాలకు ఆ నేత సూచించిన వారే  ఎంపికవుతారు. లేదంటే ఆ రుణం ఖరారు కాకుండా తెరవెనుక బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకోరావడంతో చాలా మంది అర్హులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  
- సన్నకారు రైతులకు రైతు నేస్తం పథకం ద్వారా 90 ట్రాక్టర్‌లు మంజూరు చేస్తే వాటిని వారి కనుసన్నల్లో పనిచేసే వారికి సెంటు వ్యవసాయ భూమి లేనివారికి మంజూరు చేయించారు.  
- గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారుల నుంచి ఒక్కో గృహానికి రూ. 10 వేల చొప్పున మామూళ్లు దండుకొని గృహాన్ని మంజూరు చేస్తున్నారు. ఇందుకు అన్ని మండలాల్లో దళారులను పెట్టుకొని అధికారుల నుంచి చోటా నాయకులు వసూళ్లు చేస్తున్నారు.  
- వ్యవసాయ శాఖలో సన్న, చిన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు మంజూరులో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఇక శ్మశాన వాటికల ప్రహరీలు, నీటి సౌకర్యం కల్పించే పనులన్నీ నాసిరకంగా చేసి వాటిని సైతం వదలకుండా నిధులు కాజేశారు.  
- సర్వశిక్షాభియాన్‌ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 30 వేలు మంజూరు కాగా.. అప్పటికే ఉన్న ప్రహరీలకు ఆనుకుని మరీ మరుగుదొడ్లు నిర్మించి... గోడ నిర్మాణ ఖర్చులను మిగిలించుకున్నారు. ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల్లోని అంగన్‌వాడీలే ఇందుకు నిదర్శనం. 
- ఇటుకల తయారీ కోసం ఇటుకల బట్టీ వారికి వత్తాసుగా చెరువులోని నల్లమట్టిని తరలించి ఒక్క ట్రాక్టర్‌కు రూ. 300– 500 వరకు బడా నాయకుల పేర్లు చెప్పి చోటా నాయకులు వసూళ్లు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement