‘టీడీపీ’ నాయకుల దాష్టీకం
లావేరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. స్థల వివాదం పరిష్కరించుకునే పేరుతో జరిపిన చర్చల్లో మండలంలోని బుడుమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు, బుడుమూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు రేగాన రాంబాబుపై ఆదివారం టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు టీడీపీ నాయకులపై పోలీసులు అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రాంబాబుపై దాడిని నిరసిస్తూ బుడుమూరు గ్రామ ఎస్సీలు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
బుడుమూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రేగాన రాంబాబు, టీడీపీ నాయకుడు పెదనాయిని తవిటి నాయుడు మధ్య ఇంటి స్థల వివాదం ఉంది. వివాదం పరిష్కరించుకునేందుకు ఆదివారం మధ్యవర్తుల సమక్షంలో చర్చలకు సిద్ధమయ్యారు. మధ్యవర్తులుగా టీడీపీకి చెందిన బుడుమూరు మాజీ సర్పంచ్ పెదనాయిని శ్రీరాములనాయుడు, పెదనాయిని అప్పలనర్సునాయుడు (ముసలినాయుడు), పెదనాయిని గోపాలరావును తవిటి నాయుడు తీసుకురాగా, రాంబాబు దళిత కుల పెద్దలైన పొలిమూటి అప్పన్న, కుప్పిలి తవిటయ్యను తీసుకువచ్చారు.
వైఎస్సార్‌సీపీ నాయకులను తీసుకువస్తే రాజకీయాలకు తావిచ్చినట్లు అవుతుందని రాంబాబు భావించారు. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా కులంపేరుతో దూషిస్తూ కర్రలతో అప్పలనర్సునాయుడు,తవిటినాయుడు, గోపాలరావు దాడి చేశారని బాధితుడు రాంబాబు తెలిపారు. ఈ ఘటనలో మాజీ సర్పంచ్ శ్రీరాములు నాయుడు ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పని చేశాననే కక్షతో స్థలవివాదాన్ని అడ్డుపెట్టుకుని హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు
దాడి సమాచారం తెలిసిన వెంటనే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు కింతలి గోపాలరావు, బొడ్డ సంజీవరావు, పెదనాయని సత్యనారాయణ ఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని లావేరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. టీడీపీ నాయకులు పెదనాయిని అప్పలనర్సునాయుడు , పెదనాయిని గోపాలరావు, పెదనాయిని తవిటినాయుడు తనను కులంపేరుతో దూషించి కర్రలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడిని పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రాంబాబు ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు అప్పలనర్సునాయుడు, గోపాలరావు, తవిటినాయుడుపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు ఏఎస్సై మోహనరావు తెలిపారు.
టీడీపీ నాయకులపై చర్యతీసుకోవాలి :ఎస్సీలు
రాంబాబుపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లావేరు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సీలు ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశామనే కక్షతో టీడీపీ నాయకులు వేధిస్తున్నారని ఎస్సీ మహిళలు బుడుమూరు చిన్నమ్మడు, తలే కృష్ణవేణి, రేగాన పార్వతి, దుంగ త్రినాథమ్మ, కోండ్రు కనకమ్మ, తలే శ్రీను, కోండ్రు దాలమ్మ, లింగాల అప్పలసూరి తదితరులు ఆరోపించారు. మాజీ ఎంపీటీసీపైనే దాడికి పాల్పడ్డారని, తమ వంటి సామాన్యులను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడి ప్రోద్భలంతోనే ఈఘటన జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో ఎస్సీలకు హాని జరిగితే టీడీపీ నాయకులదే బాధ్యత అని హెచ్చరించారు. టీడీపీ నాయకుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.