సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: తెలంగాణ జైత్రయాత్రకు అధికారపార్టీ నేతలు డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రకటన అనంతరం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన తొలి బహిరంగసభకు జిల్లా నాయకులు ముఖం చాటేశారు. జిల్లాలో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల ప్రభావం కాబోలు.. మెజార్టీ ఎమ్మెల్యేలు జైత్రయాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కేవలం మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే కేఎల్లార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీ ఇన్‌చార్జి అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి మినహా మిగతా నేతలు సభకు దూరంగా ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా సభల నిర్వహణను చేపట్టినప్పటికీ, జిల్లా నేతలు మాత్రం వీటిపై అంతగా ఆసక్తి చూపడంలేదు. దీనికితోడు అధికారపార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కూడా ఈ సభకు తరలి వెళ్లడంపై ప్రభావం చూపాయి. అంతేగాకుండా జిల్లాలో సీమాంధ్ర ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండడం, గెలుపోటముల్లో వీరు నిర్ణాయక శక్తి కావడంతో శివారు ఎమ్మెల్యేలు జైత్రయాత్రలో పాలుపంచుకోకపోవడమే మంచిదనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెటిలర్ల ఓట్లపై తమ రాజకీయ భవితవ్యం ఆధారపడినందున సభ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే భావనలో ఈ ప్రాంత నేతలున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు జైపాల్, సర్వే సహా మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి, రాజేందర్, శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు సభకు వెళ్లలేదు. ఇదిలావుండగా నవంబర్ 10న వికారాబాద్‌లో జైత్రయాత్ర సభ నిర్వహణకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీసీసీ.. 50వేల మందిని తరలించాలని నిర్ణయించింది. ఈ సభను జయప్రదం చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అంశంతో గట్టెక్కాలని అధికారపార్టీ భావిస్తోంది.
జైత్రయాత్రకు డుమ్మా!
Published Sat, Oct 19 2013 1:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement