అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తం | tension in agrigold Victims padayatra at vijayawada | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తం

Published Wed, Nov 9 2016 8:00 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తం - Sakshi

అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తం

- సీఎం అపాయింట్‌మెంట్‌కు నిరాకరణ
- లెనిన్ సెంటర్‌లో రోడ్డుపై పడుకుని నిరసన
- అనుమతిలేదంటూ అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి :
న్యాయం కోసం విజయవాడకు కదిలివచ్చిన అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత వెలగపూడి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు ఇచ్చింది. అందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో బుధవారం సభ నిర్వహించిన అనంతరం లెనిన్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు.

ఈ ఆందోళనలో ఏపీతోపాటు తెలంగాణా, పశ్చిమబెంగాల్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.  సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం పట్టుపట్టిన బాధితులు, ఏజెంట్లు, సంఘీభావంగా వచ్చిన రాజకీయ పార్టీల నేతలు రోడ్డుపైనే పడుకుని, బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన డిపాజిటర్లు, ఏజెంట్లు, బీజేపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, వామపక్ష నేతలను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబు సర్కారుపై బీజేపీ నేత ఘాటు విమర్శలు..
అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తుంటే హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసేందుకు, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

టీడీపీ తమకు మిత్రపక్షమైనప్పటికీ బాధితులకు అండగా నిలవడంలో బీజేపీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే సీఐడీ విచారణ నీరుగార్చి అగ్రిగోల్డ్ ఆస్తులు దక్కించుకోవడానికి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని చెప్పారు. వాస్తవాలను నిగ్గు తేల్చేలా విచారణ చేపట్టాని డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement