మాస్టర్‌ప్లాన్‌తో నిరసన తెలుపుతున్న బాధితులు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తుడా (తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ) మాస్టర్ ప్లాన్‌ను పక్కనపెట్టింది. ప్రభుత్వ ఆమోద ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మాస్టర్ ప్లాన్‌పై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణం. ఓట్లపై ప్రభావం చూపుతుందని అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. ఎన్నికల సమయంలో ఆమోదం తీసుకొస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వీరి భావన. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి కల్లా ప్లాన్‌ను ఆమోదింపజేస్తామని చెప్పిన తుడా అధికారులు, పాలకులు కొత్త ఏడాదిలోకి వస్తున్నా ఆ ఊసెత్తలేదు. ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.
తిరుపతి తుడా:తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 1982లో ఏర్పాటైంది. ప్రధానంగా వెంచర్‌లు, ప్లాట్లు అనుమతులు ఇవ్వడం, తుడా భూములను అభివృద్ధి చేసి ప్లాట్లుగా విక్రయించడం, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించడం ద్వారా వచ్చే ఆదాయంతో తుడా సంస్థ నడుస్తోంది. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల పరిధి వరకే ఉన్న తుడాను 2008లో అప్పటి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విస్తరించారు. ప్రస్తుతం ఈ నాలుగు మండలాలతో పాటు శ్రీకాళహ స్తి, ఏర్పేడు, వడమాలపేట, పుత్తూరు, రామచంద్రాపురం మండలాలు తుడా పరిధిలో ఉన్నాయి. 2005 నాటి తుడా పరిధి మాస్టర్‌ప్లాన్‌తో నెట్టుకొస్తున్నారు. పరిధికి దీటుగా ప్లాన్‌ను విస్తరించలేకపోయారు. 2009లో తుడా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని భావించారు. అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా దివంగతులు కావడంతో మాస్టర్ ప్లాన్ కాస్తా వెనక్కు మళ్లింది. 2015లో అప్పటి వీసీ వెంకట్‌రెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. వీసీలు వినయ్‌చంద్, హరికిరణ్‌లు దీనికి కృషి చేశారు. ఫలితంగా ఈ ఏడాది జనవరిలో ముసాయిదా సిద్ధమైంది. జనవరి 5 నుంచి 30 రోజుల గడువుతో దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని నోటిఫికేషన్ పొందుపరిచారు. ఒక్కసారిగా రైతులు, సన్నకారు రైతులు, స్థానికుల నుంచిముసాయిదాపై వ్యతిరేకత పెల్లుబుకింది. దీంతో అధికార పార్టీ నేతలు అవాక్కయ్యారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో దీనిని కదిపితే కొంప మునుగుతుందని భావించారు. దీంతో కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఇష్టానుసారంగా ప్రతిపాదనలు..
2035 నాటి అవసరాలంటూ రూ.23,254 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో రోడ్డు, ఇతర ప్రాజెక్టులకు సూచిస్తే అక్కడ భూములు విలువ కోల్పోతున్నాయి. అమ్మకాలు లేక రైతులు చతికిలపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కనీసం 7,500 ఎకరాలు అవసరమవుతాయి. పంట పొలాల్లో అనవసర ప్రతిపాదనలు చేశారని కొందరు, వాడుకలో ఉన్న రోడ్డును కాదని పక్కనే మరో కొత్తరోడ్డు ప్రతిపాదనలు చేయడం వెనుక కుట్ర ఏమిటని మరికొందరు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రాధాన్యతలేని ప్రాంతాల్లోనూ రెండుమూడు బైపాస్‌లకు ప్రతిపాదలు చేయడం ఎందుకంటూ ఆగ్రహం చెందుతున్నారు. అప్పో సప్పో చేసి ప్లాట్లు కొన్నవారు దిగాలు పడ్డారు. వెంచర్లు, ఇతర భూములని తేడా లేకుండా ప్రతిపాదనలు చేయడంతో అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఉండవు. దీంతో ప్రతిపాదించిన ప్రాంతంలోని భూములకు విలువ తగ్గింది. క్రయ విక్రయాలకు బ్రేక్ పడటంతో లబోదిబో మంటున్నారు.
రోడ్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రైతులు..
కొత్త రోడ్ల ప్రతిపాదనలపైనా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుపతి – అనంతపురం నేషనల్ హైవేకు రెండు బైపాస్‌లతో పాటు లింక్ రోడ్లను ప్రతిపాదించడంపై రైతులు నిరసిస్తున్నారు. అలిపిరి నుంచి జూపార్కుకు దక్షిణం వైపున కల్యాణిడ్యామ్ మలుపు వరకు 120 అడుగుల బైపాస్, అదేవిధంగా శ్రీనివాసమంగాపురం నుంచి కల్యాణిడ్యామ్ చెక్‌పోస్టు వరకు పంటతోటలపై మరో బైపాస్ ప్రతిపాదించారు. ఇప్పటికే 60 అడుగుల రోడ్డు ఉండనే ఉంది. ఈ మూడు రోడ్లను కలుపుతూ శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా మరో 60 అడుగుల లింకు రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. 34 మందికి చెందిన 36 ఎకరాల పంట భూములు పోతాయని అక్కడి రైతులు ధర్నాకు దిగారు. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు సమీపంలో ట్రాన్స్‌ఫోర్ట్ టెర్మినల్‌కు ప్రతిపాదనలు చేయడం అక్కడి రైతులకు నష్టం కలిగిస్తుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళం గ్రామం నుంచి మూడు పంటలు పండే భూముల్లో రెండు లింకు రోడ్లకు ప్రతిపాదనలు చేశారు. ఇక్కడ అంతా సన్నకారు రైతులు ఉండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చింతలచేనులో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదననూ స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తుడా మాస్టర్‌ప్లాన్‌లో పాతరోడ్లు సరిగా లేవని కొత్తరోడ్లకు ప్రతిపాదించారు. తిరుపతి, రూరల్, రేణిగుంట మండలాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో కొత్తరోడ్లు, పాత రోడ్ల విస్తరణ చేపడితే నష్టపోయే ప్రమాదముంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు, పుత్తూరు మండలాల్లోని భూములు మూడు పంటలకు అనువుగా ఉన్నాయి. ఇక్కడ భూమిని సేకరిస్తే వందలాది ఎకరాలు కోల్పోతామని రైతులు అభ్యంతరం చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో రైతులు, ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
♦ తుడా పరిధి : 1102 చదరపు కి.మీ
♦ అభివృద్ధి నేపథ్యంలో విభజన : 7 జోన్‌లు
♦ చంద్రగిరి – శ్రీకాళహస్తి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు
♦ చంద్రగిరి ప్రాంతం : ఆర్ట్ అండ్ కల్చర్ జోన్
♦ తిరుపతి : కమర్షియల్, ఎడ్యుకేషన్ జోన్లు
♦ రేణిగుంట : కమర్షియల్ జోన్
♦ గాజులమండ్యం ప్రాంతం : ఇండస్ట్రియల్, లాజిస్టిక్ హబ్
♦ పుత్తూరు: మైక్రో ఇండస్ట్రియల్ జోన్
♦ ఏర్పేడు, శ్రీకాళహస్తి : ఇండస్ట్రియల్ జోన్
♦ శ్రీకాళహస్తి, ఏర్పేడు, పుత్తూరు: ఇండస్ట్రియల్ కారిడార్
Comments
Please login to add a commentAdd a comment