మట్టపల్లి(మఠంపల్లి), న్యూస్‌లైన్: మట్టపల్లి వద్ద కృష్ణానదిపై *50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన త్వరలో ఏర్పడబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ వారధిగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న పైలాన్‌ను శుక్రవారం నాడాయన పరిశీలించారు. అక్కడ నుంచి కృష్ణానదిలో బల్లకట్టుపై ప్రయాణించి వంతెన నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలిని కూడా పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం రాష్ట్ర మంత్రి గీతారెడ్డితో కలిసి ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మట్టపల్లి, గుంటూరు జిల్లా తంగెడ రేవుల నడుమ సరిహద్దుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించనున్న ఈ వంతెన సుమారు 18 నెలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీఓటీ పద్ధతిన కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి కాగలదన్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల నడుమ ప్రధాన వారధిగా నిలుస్తుందన్నారు.
కృష్ణపట్టె ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు నిక్షిప్తమై సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కావడం, మట్టపల్లి సమీపంలో మఠంపల్లి వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభసూచికమన్నారు. తాను శక్తి వంచన లేకుండా ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఆయన వెంట ఏపీఎస్‌ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, హుజూర్‌నగర్ మార్కెట్ చైర్మన్ యరగాని నాగన్నగౌడ్, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, భూక్యా మంజీనాయక్, పీఏసీఎస్ చైర్మన్ గాదె ఎలియాస్‌రెడ్డి, ఏఐసీసీ నియోజకవర్గ మీడియా ఇన్‌చార్జ్ తన్నీరు మల్లికార్జున్, సర్పంచ్‌లు కనగాల శ్రీనివాసరావు, బుజ్జి భీముడునాయక్, మాజీ ఎంపీటీసీ దాసరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రెండురాష్ట్రాల వారధిగా నిలుస్తుంది
Published Sat, Jan 11 2014 3:22 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM
Advertisement
Advertisement