కడప కల్చరల్, న్యూస్‌లైన్ : తిరుమల-తిరుపతి దేవస్థానాలు, తమ అనుబంధ సంస్థలైన హిందూ ధర్మ ప్రచార పరిషత్, ధర్మ ప్రచార మండలితో కలసి సోమవారం నుంచి శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వారం రోజుల పాటు జిల్లాలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మొత్తం 3 వేల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. కడప రిమ్స్ వద్ద గల శ్రీరామకృష్ణమిషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 376 మంది బాలురు, 22 మంది బోధకులు, ప్రభుత్వ క్రీడా పాఠశాల కేంద్రంలో 415 మంది బాలురు, 24 మంది బోధకులు, కమలాపురంలోని పుత్తా డిగ్రీ కళాశాలలో 750 మంది బాలురు, 25 మంది బోధకులు హాజరు కానున్నారు. జిల్లా నుంచి పలువురు బాలికలు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి హాజరు కానున్నారు.
రామకృష్ణమఠంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక సభ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల ఓబుల్‌రెడ్డి, కటారు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మండలి మాజీ చైర్మన్, ప్రముఖ సాహితీవేత్త మాడుగుల నాగఫణిశర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాయింట్ కలెక్టర్ రామారావు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కమలాపురంలో కార్యక్రమాన్ని బ్రహ్మంగారిమఠానికి చెందిన అచలానంద ఆశ్రమ నిర్వాహకుడు స్వామి విరజానంద ప్రారంభిస్తారు. ఆదివారం మధ్యాహ్నానికే కడపలోని రెండు కేంద్రాలకు దాదాపు 500 మందికి పైగా బాలురు చేరుకున్నారు. కమలాపురం కేంద్రానికి కూడా 300 మందికి పైగా బాలురు హాజరయ్యారు.
నేటి నుంచి శుభ ప్రదం
Published Mon, May 19 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement