సింగరేణికి బంగారు భవిష్యత్
సింగరేణి తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం 34 భూగర్భగనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులున్నాయి. బ్రిటీష్ వారి ఏలుబడిలో 1889లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు వెలికితీశారు. 1921 డిసెంబర్ 21న సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో భారతప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ కంపెనీ షేర్లలో 51 శాతం హైదరాబాద్ సంస్థాన పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొనుగోలు చేశారు. మిగిలిన 49 శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంది.
ఇదే విధానం నేటికీ కొనసాగుతోంది. సింగరేణి వాటా 51 శాతం ఉన్నా విధాన పరమైన నిర్ణయాలలో ఎలాంటి జోక్యమూ లేకుండా పోయింది. తెలంగాణ వచ్చాక దేశంలోని టిస్కో, బిర్లా తదితర కంపెనీల మాదిరిగానే బొగ్గు ఉత్పత్తిలో 51 శాతం జాతికి అందించి మిగిలిన 49 శాతం మనకిష్టమైన వారికి విక్రయించుకునే అధికారం ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును కొంత దేశ అవసరాలకు కేటాయించి మిగిలిన బొగ్గును మనకిష్టమైన కంపెనీలకు ఈ-టెండర్ల ద్వారా విక్రయించుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్తగా భూగర్భ గనులు ప్రారంభించి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి చూపించొచ్చు. 112 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరానికి ఇక్కడ 57 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. స్థానిక బొగ్గు వనరులతో విద్యుత్ కొరతను అధిగమించవచ్చు. సంస్థ నుంచి ఉద్యోగులు, కార్మికులకు అదనంగా బోనస్ ఇవ్వవచ్చు.
కార్మికుల రక్షణకు మరిన్ని చర్యలు మెరుగుపర్చుకోవచ్చు. కోల్‌ఇండియా తరహాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో ఆర్‌అండ్‌ఆర్ పాలసీని పకడ్బందీగా అమలు చేసుకోవచ్చు. డిస్మిస్‌కు గురైన కార్మిక కుటుంబాలను ఆదుకోవచ్చు. వారసత్వ ఉద్యోగాలు కల్పించవచ్చు. వేజ్‌బోర్డు నిర్ణయాలను నేరుగా తీసుకోవచ్చు. సింగరేణిలో 610 జీవో అమలయ్యేలా చర్యలు చేపట్టవచ్చు. మైనింగ్, ఆపరేషన్స్ విభాగాలను మినహాయిస్తే పరిపాలన, ఇతర విభాగాలలో 80 శాతం తెలంగాణ ప్రాంతీయులు, 20 శాతం దేశంలోని ఇతరులను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.
- న్యూస్‌లైన్, గోదావరిఖని
బంగారు తెలంగాణ
Published Sun, Aug 11 2013 3:46 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM
Advertisement