ఐక్యతతోనే రాజ్యాధికారం : వంగాల ఈశ్వరయ్య
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
హన్మకొండ, న్యూస్‌లైన్: బీసీలు ఐక్యతతో ముందుకెళ్తేనే రాజ్యాధికారం సాధించుకోవచ్చని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన బీసీల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత ఉందో ఇప్పటివరకు జనాభా గణను ప్రభుత్వాలు చేపట్టక పోవటం శోచనీయమన్నారు. విద్య, ఉద్యోగాల్లోనే కాదు.. పదోన్నతులలో, చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
చట్టసభల్లో మహిళలకు 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్ గతంలో రాగా.. అందులోనూ ఉన్నతవర్గాలే వస్తారని భావించి సామాజిక వర్గాలవారీగా బీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌లు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందని తెలిపారు. అయితే, వివిధ రాజకీయ పార్టీలు విభేదించడంతో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌లు అనేది ఇప్పటివరకు నోచుకోలేదన్నారు. ఈ సదస్సుకు సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ అధ్యక్షుడు తిరుణహరిశేషు అధ్యక్షత వహించారు