నెల్లూరు (విద్య): విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ పోస్టు కోసం తీవ్ర పోటీ ఉన్న విషయం తెలిసిందే. సుమారు 120 మంది ఆశావాహులు ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ గుట్టుచప్పుడు కాకుండా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిందని సమాచారం. ఎంఎల్‌సీ ఎన్నికల కోడ్ కారణంగా వీసీ నియామకాలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి.
అయితే ఆశావాహుల్లో నలుగురి పేర్లు పోస్టు కోసం ప్రముఖంగా వినపడుతున్నాయి. సామాజిక వర్గం, రాజకీయ పలుకుబడి ఉన్న ఈ నలుగురిలో వీసీగా ఎవరిని నియమించాలి అనే అంశంపై రాష్ట్ర మానవ వనరులు శాఖ, పురపాలక శాఖ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని యూనివర్సిటీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణకు పీహెచ్‌డీ గురువైన విశ్రాంత స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ బాలసిద్ధముని, ఆంత్రోపాలజీ ఆచార్యులు పాపారావుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. పాపారావు కావలి నియోజకవర్గానికి చెందిన వారు. పైగా టీడీపీ ఉన్నత శ్రేణి నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేరుంది. వీరిద్దరిలో ఎవర్ని నియమించాలా..? అని మంత్రులిద్దరూ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. సీనియార్టీలో భాగంగా హిస్టరీ ఆచార్యులు కిరణ్‌కాంత్ చౌదరి సైతం సీఎంకు అత్యంత సన్నిహితుడు. పద్మావతి మహిళా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ మహేశ్వరి కూడా పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె భర్త రాష్ట్రస్థాయిలో ఓ సామాజిక వర్గానికి నాయకుడు కావడంతో రాజకీయ ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో వీసీలను గవర్నర్ నియమించేవారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తేనే గవర్నర్ వీసీలను నియమిస్తారు. ఈవిషయంలో రాష్ట్రప్రభుత్వం కూడా సామాజిక వర్గం, రాజకీయ పలుకుబడులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీసీ జాప్యం-పరీక్షలపై ప్రభావం
వీఎస్‌యూలో వీసీ నియామకంలో జాప్యం వల్ల వర్సిటీ పాలనలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థి సంఘాల సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కుతున్నాయి. సిబ్బందిలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. పూర్వ వీసీ ఆచార్య రాజా రామిరెడ్డి నవంబర్ మొదటివారంలో పదవీ విరమణ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ వియన్నారావును ఇన్‌చార్జిగా నియమించారు. అప్పుడు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆచార్య నాగేంద్ర అనారోగ్య కారణాలు చూపి రాజీనామా చేశారు. కావలి పీజీ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ శివశంకర్ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు.
ఇన్‌చార్జి వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌లతో పాలన కుంటుపడిందని యూనివర్సిటీ సిబ్బంది బాహాటంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో శాఖల మధ్య సమన్వయ లోపం వీసీ అందుబాటులో లేకపోవడం, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌కు పూర్తి అవగాహన లేకపోవడం పరీక్షల నిర్వహణకు అవరోధాలుగా మారుతున్నాయని వారి వాదన. దీనికి తోడు వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య మురుగయ్య, కాంట్రాక్టు లెక్చరర్స్ మధ్య గొడవలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. నూతన భవన నిర్మాణాలు చేపట్టి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పరిస్థితుల్లో విశ్వవిద్యాలయంలో ఇన్‌చార్జిల పాలన ఇబ్బందికరంగా మారింది అనడంలో సందేహం లేదు.
జాప్యానికి కారణాలు?
రాష్ట్రంలోని నాలుగు వర్సిటీల్లో వీసీల నియామకానికి బ్రేక్‌పడే అవకాశం ఉందని సమాచారం. రాయలసీమ, జేఎన్‌టీయూ కాకినాడ, ఎస్‌కేయూ అనంతపురం, వీఎస్‌యూ నెల్లూరు వర్సిటీ వీసీల ఖాళీలను భర్తీ చేసేందుకు ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురితో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. యూజీసీ నుంచి నామిని, సంబంధిత యూనివర్సిటీ పాలక మండల నుంచి ఒక నామిని, రాష్ట్రప్రభుత్వం నుంచి ఒకరిని ఈ సెర్చ్ కమిటీల్లో నియమించారు. ఈ నాలుగు వర్సిటీలో పాలక మండళ్లు లేవు. అయినా ఈసీని నామిని సెర్చ్ కమిటీలోకి తీసుకున్నారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని సెర్చ్ కమిటీలోకి తీసుకున్నారు. దీనిపై అనంతపురానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గండిపడే అవకాశం ఉంది. వీసీల నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాలకు న్యాయస్థానం గండి కొట్టే పరిస్థితి ఉం దని వర్సిటీవర్గాల అభిప్రాయం.
ఈ క్రమంలో రాజకీయ, సామాజిక పలుకుబడి ఉన్న ఆ నలుగురు వీసీ అభ్యర్థులలో ఒకరిని వీఎస్‌యూ వీసీగా నియమించే అవకాశం డౌటేనని వారి విశ్లేషణ. వీఎస్‌యూ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు, పరీక్ష నిర్వహణ అధికారుల నియామకంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని గతంలో జరిగిన సంఘటనలు విశ్వవిద్యాలయ సిబ్బంది గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వీఎస్‌యూ పరిపాలనకు ఆ దేవుడే దిక్కులా కనిపిస్తోంది.
వీసీ సీటుకు ఫీట్లు
Published Sun, Mar 1 2015 3:09 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement