సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్
ఎంవీపీకాలనీ: హామీలు, అంకెల గారడీలు తప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల సం క్షేమం కోసం చేసిందేమిలేదని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ ఆరోపించారు. నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిస్తున్న టీడీపీ తీరును బుధవారం ఎంవీపీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నో వరాలు కురిపించాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించగా, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందాయన్నారు.
అయితే నేటికి ఆ హామీలు నిరుద్యోగులకు అందని దాక్షగానే మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. టీడీపీ తన పబ్బం గడుపుకోవడానికి నిరుద్యోగభృతి అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. నాలుగున్నరేళ్లు అవుతున్నా ఈ హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీతోపాటు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష దరఖాస్తు రుసుం పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. సమితి శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అధ్యక్షులు టి.సూర్యం, గౌరీశంకర్, గుంటూరు జిల్లా నాయకులు దాసు, కోటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment