నెల్లూరు(అర్బన్): శరీరంపై తెల్లటి మచ్చలు కలిగి ఉన్న వారిని అక్కడక్కడా చూస్తుంటాం. ఇలాంటి వారు నలుగురిలో కలుపుగోలుగా ఉండేందుకు ఇబ్బంది పడతారు. మచ్చలు కలిగిన వారు ఆత్మన్యూనతకు గురై మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి మచ్చలను వైద్యభాషలో విటిలిగో (బొల్లి) అంటారు. తన నృత్య సంగీతంతో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన మైకేల్ జాక్సన్ తన శరీరంపై మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నారు. ఆయన 2011, జూన్ 25న మృతి చెందారు. ఆయన మృతి చెందిన రోజును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ విటిలిగో నివారణ దినోత్సవంగా ప్రకటించింది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం, నివారించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దేశంలో సైతం ఈ వ్యాధిపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారించేందుకు కృషి చేస్తోంది.
48 వేల మంది బాధితులు
శరీరానికి మంచి ఆకృతి, అందాన్ని కల్పించేది చర్మమే. అలాంటి చర్మం బొల్లికి గురైతే ఆ వ్యక్తి నలుగురిలో తిరగలేక మానసికంగా కుంగిపోతుంటారు. లక్ష జనాభాలో 1500 మంది వరకు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో సుమారు 32 లక్షల జనాభా ఉండగా, దాదాపు 48 వేల మంది వ్యాధికి గురయ్యారు. అయితే ఈ మచ్చలు కొందరికి చేతికి, గడ్డం లాంటి వాటికే పరిమితం కాగా, మరి కొందరికి శరీరమంతా ఉంటున్నాయి. నిత్యం జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకు వివిధ చర్మ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
మచ్చలకు అనేక కారణాలు
♦ అనువంశికత ద్వారా జన్యువుల్లో తేడాలు వచ్చి చర్మంలో ఉండే మెలనోసైట్స్ §ð దెబ్బతింటాయి. రంగు ఉత్పత్తి చేసే కణాలు నశిస్తాయి. ఫలితంగా తెల్ల మచ్చలు వస్తుంటాయి.
♦ నిత్యం మానసిక ఒత్తిడి, పేగుల్లో ఇన్‌ఫెక్షన్ రావడం, లివర్ విధుల్లో తేడాలు, టైట్‌గా ఉండే వస్త్రాలను రోజూ ధరించడమూ కారణమే.
♦ పొగతాగడం, కాలిన గాయాలు, ప్రమాదాలు జరిగినప్పుడు, అందం కోసం విపరీతంగా వాడే రసాయన మందులు కూడా వ్యాధికి కారణంగా నిలుస్తున్నాయి.
♦ జన్యు సంబంధిత పరిణామాలతో మెలనిన్ హార్మోన్లో తేడాతో శరీరంపై మచ్చలు రావడం, త్వరగా వెంట్రుకలు తెల్లబడిపోతాయి.
♦ థైరాయిడ్, షుగర్ వ్యాధి, అమీబియాసిస్ లాంటి వాటితో వాటు రోగనిరోధక శక్తి బలహీనపడటంతో మచ్చలు రావచ్చు.
ప్రాథమిక దశలో వైద్యం అవసరం
చర్మంపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడుతున్నప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం పొందాలి. మచ్చలను నిర్లక్ష్యం చేయకూడదు. పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత మందులతో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తొలి దశలోనే చర్మ వైద్యులను సంప్రదించి మందులు వాడితే మచ్చలు మాయమవుతాయి.
అందుబాటులో వైద్యం
ఆధునిక సాంకేతికత వచ్చిన నేపథ్యంలో బొల్లిపై కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యం అందుబాటులో ఉంది. మహానగరాలకే పరిమితమైన స్కిన్ గ్రాఫ్టింగ్, ఎక్సైమర్ లైట్ థెరపీ లాంటి ఆ«ధునిక చికిత్స నెల్లూరులోనూ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కువ కాలం వైద్యం పొందితే వ్యాధి నయమవుతుంది. – హర్షవర్ధన్, స్కిన్ స్పెషలిస్ట్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment