పశ్చిమ గోదావరి జిల్లా : దైవ దర్శనానికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురవటంతో ఓ మహిళ మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాటికొండ వెంకటసుబ్రహ్మణ్యం ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన గెల్లి మహాలక్ష్మి(58) కొద్ది రోజుల క్రితం హైదరాబాదు కుమార్తె ఇంటికి వెళ్లారు.
మహాలక్ష్మి, ఆమె అల్లుడు వెంకటసుబ్రహ్మణ్యం, కుమార్తె జానకీరమాదేవి, ఇద్దరు మనవరాళ్లు కలిసి శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు హైదరాబాదు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి కారులో బయలు దేరారు. కారును తాత్కాలికంగా కుదుర్చుకున్న డ్రైవర్ నడుపుతున్నాడు. వేగంగా వెళుతున్న కారు శనివారం ఉదయం ఖండవల్లి సమీపంలోకి వచ్చేప్పటికి ముందు వెళుతున్న ట్రాలీ లారీని తప్పించబోగా అదుపు తప్పింది. రోడ్డు మార్జిన్‌లో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
కారు ముందు సీట్లో కూర్చున్న మహాలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. కారులోని వెంకటసుబ్రహ్మణ్యం, జానకీరమాదేవి దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment