సిగ్గు సిగ్గు!
వీరఘట్టం : ఆరుబయట మలవిసర్జన సాంఘిక దురాచారమని.. దీన్ని అరికట్టా లి అంటూ ఓవైపు.. పరిశుభ్రతతో స్వచ్ఛభారత్ సాధిద్దామని మరోవైపు ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాస్తవరూపం దాల్చడంలేదు. గ్రామాలు.. వీధులు కాదు.. అతిముఖ్యమైన కళాశాలలోనూ ఇదే దుస్థితి నెలకొనడానికి ముమ్మాటికీ అధికారుల బాధ్యతారాహిత్యమేనని అర్థం చేసుకోవచ్చు. వీరఘట్టం జూని యర్ కళాశాల పరిస్థితిని పరిశీలిస్తే ఎవరి ఇందుకు ఎవరి లోపమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ కళాశాలలో 500 మంది పైబడి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులుండగా, అందులో 200 మంది కిపైగా బాలికలే ఉన్నారు. వీరందరి కోసం మరుగుదొడ్లు ఉన్నా, వాటికి రన్నింగ్ వాటర్ సదుపాయం లేక అధ్వానంగా తయారై వినియోగానికి పనికిరాకుండా పోయాయి. అత్యవసరమైతే ఇంటర్‌వెల్ సమయంలో విద్యార్థులు సిగ్గు తో తలదించుకుని దూరప్రాంతాల్లోని తుప్పల వైపు పరుగులు తీస్తున్నారు. అయినా ఇక్కడి పరిస్థితిని సమీక్షించాల్సి న అధికారులు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. నైట్ వాచ్‌మన్ లేకపోవడం వల్లే ఆకతాయిలు సెలవుల సమయంలో మరుగుదొడ్లను పాడు చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఇంటర్‌బోర్డు అధికారులు వెంటనే స్పందించి సమస్య ను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
అమ్మాయిల సమస్యలు గుర్తించాలి
అమ్మాయిల సమస్యలను ఎలా చెప్పుకోగ లం. మరుగు కోసం రోజూ పడుతున్నాం. కళాశాలలో ఉన్న బాత్‌రూమ్‌కు నీటి సదుపాయం లేక పూర్తిగా అధ్వానంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆరుబయటకు పోతున్నాం.
- జి.పవిత్ర,
జూనియర్ ఇంటర్
సిగ్గుతో చచ్చిపోతున్నాం...
మరుగు కోసం తుప్పల చాటుకు వెళ్లాల్సిన పరిస్థితి మాది. ముఖ్యంగా బాలికలం అనుక్షణం సిగ్గుతో చచ్చిపోతున్నాం. సిగ్గుతో కొంతమంది విద్యార్థులు ఆరుబయటకు రాలేక లోలోపల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- పి.రమాదేవి,జూనియర్ ఇంటర్