మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్ల నాని
ఏలూరు (ఆర్‌ఆర్ పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి వెళ్లిన సందర్భంగా నానిని చూసి ఆయన తన వాహనంలోకి ఆహ్వానించారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట నాని కొంత దూరం కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా నాని జిల్లాలో పార్టీ వ్యవహరాలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నూతన మద్యం విధానం కారణంగా జిల్లాలోని మహిళలు చంద్రబాబుపై మండిపడుతున్న విషయాన్ని చెప్పారు.
గతంలో ఎనప్నడూ లేని విధంగా ఇంటింటికీ మద్యం అందుబాటులో ఉండేలా రూపొందించి మద్యం విధానాల కారణంగా ఎదుర్కొనే సమస్యలపై మహిళలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు గానీ, ఇళ్ల స్థలం గానీ, ఒక్క ఇల్లుగానీ మంజూరు చేయకపోవడంపై పేదలు ఆగ్రహంగా ఉన్నారని జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా నిలుస్తుందనే విషయాన్ని ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన ఆందోళనా కార్యక్రమాల ద్వారా ప్రజలు గ్రహించారన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని నాని వివరించారు.
జగన్ దృష్టికి జిల్లా సమస్యలు
Published Fri, Jul 3 2015 1:20 AM | Last Updated on Wed, Oct 3 2018 7:34 PM
Advertisement