విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్ | YS Jagan mohan reddy meets naveen patnaik, he extends support | Sakshi
Sakshi News home page

విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్

Published Sun, Nov 24 2013 12:10 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్ - Sakshi

విభజనలో రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు: నవీన్ పట్నాయక్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సానుకూలంగా స్పందించారు. నవీన్ పట్నాయక్తో భువనేశ్వర్లో సమావేశమైన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. ''ఆర్టికల్ 3 ని సవరించాలని కోరాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో చెప్పాను. ఇది కొత్త సంప్రదాయం. ఇతర రాష్ట్రాలకు కూడా పాకొచ్చని తెలిపాను. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేదా మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని తప్పనిసరి చేయాలని తెలిపాను. అలాగే పార్లమెంటులో కూడా చేయాలి. ఇది ఇక్కడితో ఆపకపోతే, ఆర్టికల్ 3ని సవరించకపోతే ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లంతా తమ ఇష్టారాజ్యంగా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతారు. అందుకే దీన్ని ఆపేందుకు సహకరించాలని నవీన్జీని కోరాను. ఆయన తన మద్దతు తెలిపారు. నవీన్ పట్నాయక్కు, నాకు మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి, ఇవి మున్ముందు కూడా కొనసాగుతాయి'' అని ఆయన చెప్పారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అందులో భాగంగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారు. ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నవీన్ పట్నాయక్ను కలవడానికి ముందు పై-లీన్ ప్రభావంతో నష్టపోయిన కళింగాంధ్రులను జగన్ కలిశారు. తుఫానపు నష్ట తీవ్రత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని జగన్ ఎదుట కళింగాంధ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఒడిశా పర్యటనపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా అంటూ ఒడిశా మీడియా పదే పదే జగన్ను ప్రశ్నించింది.

సంకుచిత రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విడదీయరాదని నవీన్‌పట్నాయక్‌ అన్నారు. రాష్ట్ర విభజన సమస్యను వైఎస్‌ జగన్ తనతో చర్చించారని, రాష్ట్ర విభజన అనేది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా సున్నితమైన అంశమని ఆయన తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునేముందు అయినా ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని, అంతేతప్ప కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాలను విడదీయడం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాజకీయవర్గాలతో నిశిత చర్చను పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు.

కాగా, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను వైఎస్‌ జగన్ కలుస్తారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రేతో కూడా భేటీ అవుతారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారిద్దరినీ కూడా జగన్ కోరనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement