ఇక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు | YS Jagan Mohan Reddy Suggests About YSR Village Clinics | Sakshi
Sakshi News home page

ఇక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు

Published Fri, Feb 28 2020 4:13 AM | Last Updated on Fri, Feb 28 2020 8:30 AM

YS Jagan Mohan Reddy Suggests About YSR Village Clinics - Sakshi

వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండాలన్నారు. అందులో బీఎస్సీ నర్సింగ్‌ చదివిన స్టాఫ్‌ అందుబాటులో ఉండాలని చెప్పారు. విలేజ్‌ క్లినిక్‌ అనేది రెఫరల్‌ పాయింట్‌లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడికొచ్చే రోగులకు రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలకు ఇక్కడే వైద్యమందితే  దూరం వెళ్లే ఇబ్బందులు తప్పుతాయని, విలేజ్‌ క్లినిక్‌లోనే మందులు అందిస్తే రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు.

బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో అన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 బోధనాసుపత్రులు ఉంటే ప్రజలకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నామని, ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆసుపత్రులు ఉన్నాయని, మరో 7 వైద్య కళాశాలలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని ఈ సందర్భంగా సీఎంకు ఆ శాఖ అధికారులు వివరించారు. బోధనాసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు, నర్సుల కొరతను అధిగమించాలని సీఎం సూచించారు. ప్రతి టీచింగ్‌ ఆసుపత్రిలో డెంటల్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ‘డా.వైఎస్సార్‌ చిరునవ్వు’ ద్వారా ఉచితంగా దంత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు జరగాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు దీనిపై అధ్యయనం చేయాలని, ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలించాలన్నారు. కంటి వెలుగు తరహాలోనే ‘డా.వైఎస్సార్‌ చిరునవ్వు’ కార్యక్రమం కూడా సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. అవ్వాతాతలకు కళ్లద్దాలు ఇస్తున్నారా.. అని అడిగారు. జూలై 8న ‘డా.వైఎస్సార్‌ చిరునవ్వు’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement