'కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పక్కకు పెట్టి.. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రేమ కురిపిస్తున్నబాబుకు ఆ ప్రాజెక్టుతో భారీగా ముడుపులు ముడుతున్నాయని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రాజెక్టుల యాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రి హంద్రీనీవాకు చేరుకుంది. అక్కడ హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చంద్రబాబు అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. రూ.1600 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా చంద్రబాబుకు రూ.300 కోట్ల ముడుపులు అందుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు.
బాబుకు రాయలసీమపై నిజమైన ప్రేమే ఉంటే గాలేరు, నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు ముందు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేసిన బాబు.. ఇప్పడు రాయలసీమకు నీళ్లు అంటూ కొత్త రాగం అందుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని జగన్ నిలదీశారు. ఇంకా రూ.11 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవుతుందని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదా? అని జగన్ ప్రశ్నించారు. ఆ దివంగత నేత వైఎస్సార్ హయాంలో హంద్రీనీవాకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. బాబు ఆ ప్రాజెక్టు రూ13 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. చంద్రబాబు ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయని జగన్ విమర్శించారు.
రాయలసీమ నీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ తపించే వారని.. ఆయన హయాంలో 85 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని జగన్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టుల నిధులు కేటాయింపుల్లో అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి రూ,1100కోట్ల కావాల్సి వస్తే.. చంద్రబాబు బడ్జెట్ లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైతు రుణాలు మాఫీ సంగతి అటుంచితే.. వడ్డీలు కూడా ఇప్పటివరకూ మాఫీ కాలేదని.. చివరకు డ్వాక్రా మహిళలను కూడా బాబు మోసం చేశారని జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముగిసిన వైఎస్సార్ సీపీ ప్రాజెక్టుల బస్సుయాత్ర..
మూడు రోజుల పాటు సాగిన వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర ముగిసింది. ధవళేశ్వరం, పోలవరం,పట్టిసీమ, కృష్ణా బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల, పోతిరెడ్డి పాడు, హంద్రీనీవా ప్రాజెక్టులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు.ఈ యాత్రలో ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.