విజయవాడ: కృష్ణజిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ నేత గౌతం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు విజయసాయి రెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాద రాజు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక జరుగనుంది.
అనంతరం సత్యనారాయణపురంలోని నాడర్ కళ్యాణ మండపంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించడానికి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి ముందస్తుగా సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు హజరు కానున్నారు.
ప్రభుత్వం రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హమీల తీరుపై ప్రసంగించనున్నారు. కాగా ఈనెల 31వ తేదీ , ఫిబ్రవరి 1వ తేదీల్లో పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.