ఫైనాన్షియర్ల చేతిలో ‘ఆటో’ మార్కెట్ | auto market in financiar's hand's | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియర్ల చేతిలో ‘ఆటో’ మార్కెట్

Published Fri, Jul 22 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

ఫైనాన్షియర్ల చేతిలో ‘ఆటో’ మార్కెట్

ఫైనాన్షియర్ల చేతిలో ‘ఆటో’ మార్కెట్

వడ్డీ ఎక్కువైనా సులభంగా రుణం..
నిబంధనలతో వెనకబడ్డ బ్యాంకులు
ఒక్క హైదరాబాద్‌లోనే 200 మంది ఫైనాన్సియర్లు
బ్యాంకు రుణాలు లభిస్తే రెండింతల వృద్ధి: పరిశ్రమ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రైతులకు రుణాలివ్వటంలో బ్యాంకులు విఫలమవుతున్నాయనేది నిత్యం కనిపించే వార్త. రైతులే కాదు!! ఆ మాటకొస్తే ఆటో డ్రైవర్లదీ అదే పరిస్థితి. ఎందుకంటే ప్రత్యక్షంగా కోటి మందికి పైగా ఆధారపడ్డ ఆటోలకు రుణాలివ్వటంలో బ్యాంకులది మామూలు వెనకబాటు కాదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఆటో కొనుక్కున్న వారి సంఖ్య కేవలం 5 శాతం ఉంటోందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు!! మరి మిగిలిన రుణాలెవరిస్తున్నారని అనుకుంటున్నారా..? అది  ఫైనాన్షియర్ల రాజ్యం. దాన్లో బ్యాంకులకు చోటులేదు.

 దేశవ్యాప్తంగా 56 లక్షల ఆటోలు రోడ్లపై తిరుగుతుండగా కోటి మందివరకూ ప్రత్యక్షంగా ఆధారపడ్డారు. పరోక్షంగా ఆధారపడ్డవారి సంఖ్య చాలా ఎక్కువ. గతేడాది దేశవ్యాప్తంగా 4,40,000ల ఆటోలు అమ్ముడయ్యాయి. రూ.9,000 కోట్లకుపైగా విలువైన ఈ పరిశ్రమలో ఫైనాన్షియర్లదే సింహభాగం. బ్యాంకు నిబంధనలు మరీ కఠినంగా ఉండటంతో ఔత్సాహికులు ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించి... ఒకే రోజులో రుణం తీసుకుని ఆటోతో రోడ్డుపైకి వస్తున్నారు. బ్యాంకులు తమ విధానాలను మార్చుకుంటే ఆటో మార్కెట్ వృద్ధి చెంది తక్కువ వడ్డీకి రుణాలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నది పరిశ్రమవర్గాల మాట. నిజానికి నిబంధనలు కఠినంగా ఉండటంతో వీటిద్వారా రుణాలు తీసుకున్న వారి సంఖ్య 5 శాతాన్ని మించటం లేదు. రికవరీ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్ల ఫైనాన్షియర్లు ఎక్కువ వడ్డీకి రుణాలివ్వటమే కాక, వాటిని విజయవంతంగా వసూలు చేసుకోగలుగుతున్నారు కూడా. కేవలం ఆటోలకు రుణాలిచ్చే ఫైనాన్షియర్లు హైదరాబాద్‌లోనే 200 మందికిపైగా ఉన్నారంటే పరిస్థితి అర్థంకాక మానదు.

 రెండు రెట్లకు అవకాశాలు..
బ్యాంకులతో పోలిస్తే ఆటో యజమానులు ఫైనాన్షియర్లకు ప్రతి నెలవారీ వాయిదాలోనూ రూ.300-500 అధికంగా చెల్లిస్తున్నట్లు శ్రీ వినాయక బజాజ్ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. బ్యాంకు రుణాల లభ్యత పెరిగితే ఆటోల అమ్మకాలు రెండు రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదన్నారు. బ్యాంకులు నిబంధనలను సరళతరం చేయాలని బజాజ్ ఆటో కమర్షియల్ వెహికిల్స్ రీజనల్ మేనేజరు పి.రాఘవరావు చౌదరి అభిప్రాయపడ్డారు. డిమాండున్నా ఆశించిన స్థాయిలో కొత్త ఆటోలు నమోదు కావటం లేదని, రుణాల లభ్యత తగ్గటమే కారణమని చెప్పారాయన. బజాజ్ అమ్మకాల్లో 25 శాతం వాహనాలకు బజాజ్ ఫైనాన్స్ రుణం సమకూర్చిందన్నారు. ‘‘రుణాలిచ్చేందుకు ఇప్పటికే 18 బ్యాంకులతో చేతులు కలిపాం. మరిన్ని బ్యాంకులతో చర్చిస్తున్నాం’’ అన్నారాయన.

ప్రపంచంలో టాప్..
ప్రపంచంలోనే ఆటోల వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌లో... త్రీవీలర్ విభాగంలో ఏడు కంపెనీలున్నాయి. ప్యాసింజర్ ఆటో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 2016-17 ఏప్రిల్-జూన్‌లో 26.4 శాతం వృద్ధితో 1,14,928కి చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5 లక్షల వాహనాలు రోడ్డెక్కుతాయనే అంచనాలున్నాయి. ఇక దిగ్గజ కంపెనీ అయిన బజాజ్ 2015-16లో 2,54,967 ఆటోలను విక్రయించింది. ఈ ఏడాది 3 లక్షల యూనిట్లను లక్ష్యంగా చేసుకుంది.

జూన్ నాటికి బజాజ్‌కు 64 శాతం మార్కెట్ వాటా ఉంది. మరోవంక ఇతర రాష్ట్రాల్లో సగటున 11-12 ఏళ్లపాటు ఆటోను నడుపుతుండగా తెలుగు రాష్ట్రాల్లో 7-8 ఏళ్లకే స్క్రాప్‌కు పంపిస్తున్నారు. గిరాకీ ఉండడంతో వాహనం ఎక్కువ దూరం తిరగడమే ఇందుకు కారణమని రాఘవరావు చౌదరి చెప్పారు. క్యాబ్‌లు వచ్చినప్పటికీ ఆటోలకు డిమాండ్ తగ్గలేదన్నారు. కాగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, విజయవాడ, గుంటూరులో మాత్రమే కొత్త ఆటోల పర్మిట్లపై ప్రభుత్వ నియంత్రణ ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement