న్యూఢిల్లీ: తీవ్ర రుణ భారంతో ఉన్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, దేశవ్యాప్తంగా తన అధీనంలో ఉన్న భూముల విక్రయంపై దృష్టి సారించింది. ఈ భూముల విలువ రూ.20,000 కోట్లు ఉంటుందని అంచనా. విక్రయించాల్సిన భూముల జాబితాను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) పంపింది. ఏటేటా ఆదాయాలు పడిపోతూ, నష్టాలు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితుల్లో... భూములు, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్ విక్రయం ద్వారా వచ్చే నిధులతో సంక్షోభం నుంచి బయటపడాలని సంస్థ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 32.77 లక్షల చదరపు మీటర్ల విస్తీరణంలో భవనాలు, ఫ్యాక్టరీలు ఉండగా, 31.97 లక్షల చదరపు మీటర్ల విడి భూమి ఉందని గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్పొరేట్ కార్యాలయం జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా తెలుస్తోంది.
ఇలా వినియోగంలో లేని భూమి పారదర్శక విలువ 2015 ఏప్రిల్ 1కి రూ.17,397 కోట్లు కాగా, ప్రస్తుత విలువ రూ.20,296 కోట్లుగా ఉంటుందని అంచనా. 2014–15 ద్రవ్యోల్బణ సూచీ వ్యయం ఆధారంగా ఈ విలువకు రావడం జరిగినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి. అమ్మి, సొమ్ము చేసుకోవాలనుకుంటున్న వాటిల్లో ముంబై, కోల్‌కతా, పశ్చిమబెంగాల్, ఘజియాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలికం ఫ్యాక్టరీలు, వైర్‌లెస్ స్టేషన్లు, ఇతర కార్యాలయ భవనాలు, ఉద్యోగుల కాలనీలు కూడా ఉన్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బీఎస్‌ఎన్‌ఎల్ రూ.14,000 కోట్ల నస్టాలను ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఆదాయం రూ.19,308 కోట్లుగా ఉండొచ్చని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభకు ఇచ్చిన సమాధానం ఆధారంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment