క్యాప్‌జెమిని చేతికి ఐగేట్ | Capgemini to acquire iGate for about $4 billion | Sakshi
Sakshi News home page

క్యాప్‌జెమిని చేతికి ఐగేట్

Published Tue, Apr 28 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

క్యాప్‌జెమిని చేతికి ఐగేట్

క్యాప్‌జెమిని చేతికి ఐగేట్

- 4 బిలియన్ డాలర్లకు ఆఫర్
- డీల్‌కు ఇరు కంపెనీలు ఓకే

న్యూయార్క్: ఫ్రెంచి ఐటీ సేవల దిగ్గజం క్యాప్‌జెమిని తాజాగా అమెరికాకు చెందిన ఐగేట్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం నగదు రూపంలో 4 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. విలీన ఒప్పందం కింద ప్రతి ఐగేట్ షేరుకి 48 డాలర్ల చొప్పున క్యాప్‌జెమినీ ఆఫర్ చేస్తుంది. ఇది శుక్రవారం ఐగేట్ షేరు క్లోజింగ్ ధర 45.85 డాలర్లతో పోలిస్తే 4.7 శాతం అధికం.

ఇరు కంపెనీలు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ రెండు సంస్థలూ కలిస్తే 14 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఐబీఎం వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే భారీ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఐగేట్‌కి ప్రస్తుతం జనరల్ ఎలక్ట్రిక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా తదితర భారీ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. డీల్ పూర్తయ్యాక ఇవన్నీ కూడా క్యాప్‌జెమిని ఖాతాలోకి రాగలవు. అలాగే ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల సంస్థలకూ సేవ లు అందించేందుకు వీలు పడుతుంది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ఐగేట్.. ప్రస్తుతం నెట్‌వర్క్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ తదితర సేవలు అందిస్తోంది.

ఇరు కంపెనీల బోర్డులు, ఐగేట్‌కి చెందిన మెజారిటీ షేర్‌హోల్డర్లు డీల్‌కు ఆమోదముద్ర వేశారు. విలీనానంతరం ఏర్పడే సంస్థలో 1,90,000 మంది ఉద్యోగులు ఉంటారని క్యాప్‌జెమిని తెలిపింది. ఇందులో 27,000 మంది ఉద్యోగులు భారత్‌లోనూ.. 50,000 మంది అమెరికాలోనూ ఉంటారు. కంపెనీ ఆదాయాల్లో 30 శాతం ఉత్తర అమెరికా నుంచి లభిస్తుంది. సొంత నగదు నిల్వలు, కొంత రుణం ద్వారా డీల్‌కు అవసరమైన నిధులను సమకూర్చుకోనున్నట్లు క్యాప్‌జెమిని సీఈవో పాల్ హెర్మిలిన్ తెలిపారు.
 
డీల్‌తో భారత్‌లో కార్యకలాపాలకు మరింత ఊతం లభించగలదని వివరించారు. తమ ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఐగేట్ సీఈవో అశోక్ వేమూరి తెలిపారు.
 
కొనుగోలుకు కారణాలు..
⇒ క్యాప్‌జెమిని ప్రధాన ఆఫ్‌షోర్ సెంటర్లలో భారత్ కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం కంపెనీకి 50,000 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా సర్వీసుల వ్యయాలు గణనీయంగా తగ్గించుకునే దిశగా భారత్‌లో సిబ్బంది సంఖ్యను 2016 ఆఖరుకి 70వేలకు పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఐగేట్ కొనుగోలుతో ఉద్యోగుల సంఖ్య 1,00,000కు చేరొచ్చని అంచనా.
⇒క్యాప్‌జెమినికి ప్రస్తుతం మెజారిటీ ఆదాయాలు బ్రిటన్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. ఐగేట్‌ను కొనడం ద్వారా అమెరికా మార్కెట్‌లో క్యాప్‌జెమినికి పట్టు లభిస్తుంది.
⇒ఐబీఎం, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ పటిష్టంగా ఉన్న ఇన్‌ఫ్రా వ్యాపారంలో క్యాప్‌జెమినికి అంత  పేరు లేదు. ఐగేట్‌తో ఆ లోటు తీరిపోతుంది.
⇒భారత్‌లో వ్యాపారాన్ని మరింతగా పటిష్టం చేసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement