ఫేస్‌బుక్ ద్వారా నగదు లావాదేవీలు
అందుబాటులోకి హాట్ రెమిట్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు, ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు నగదు బదిలీ సాధారణం. ఫేస్‌బుక్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్(బీబీఎం) అకౌంటే ఇ-వాలెట్‌గా మారిపోతే.. మొబిలిటీ, పేమెంట్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ డిజిట్ సెక్యూర్ ‘హాట్ రెమిట్’ పేరుతో ఆన్‌లైన్, మొబైల్ సోషల్ వాలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. హాట్ రెమిట్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు. ఫేస్‌బుక్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్ అకౌంట్ నుంచే సన్నిహితులకు డబ్బులు పంపించొచ్చు. బిల్లులు చెల్లించొచ్చు, బస్ టికెట్లు కొనొచ్చు.
నగదు స్వీకరించినవారు ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. లావాదేవీల మొత్తంపై నెలకు రూ. 50,000 వరకు పరిమితి ఉంది. సోషల్ వెబ్‌సైట్లు వేదికగా ఇ-వాలెట్ సేవలను పరిచయం చేయడం ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇదే తొలిసారి అని డిజిట్ సెక్యూర్ చైర్మన్ ఎ.కృష్ణప్రసాద్ మీడియాకు తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, సినీ నటి శ్రీదేవి కపూర్ చేతుల మీదుగా కంపెనీ ఈ సేవలను బుధవారమిక్కడ ప్రారంభించింది.
ఇలా పనిచేస్తుంది..
ఫేస్‌బుక్, బీబీఎం అకౌంట్‌లో సెర్చ్ బాక్స్ వద్ద హాట్ రెమిట్ అని టైప్ చేయాలి. హాట్‌రెమిట్ వెబ్‌సైట్ వస్తుంది. కస్టమర్ తన వివరాలు ఇవ్వగానే ఉచిత ఇ-వాలెట్(ఖాతా) రూపుదిద్దుకుంటుంది. డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే ఈ వాలెట్‌లోకి నగదు పంపించాల్సి ఉంటుంది. వాలెట్ నుంచి కరెంటు బిల్లు, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, బీబీఎం ఫ్రెండ్‌కు నగదు పంపించొచ్చు. అలాగే నగదు కోరుతూ ఫ్రెండ్‌కు రిక్వెస్టూ పెట్టొచ్చు. లావాదేవీలన్నిటికీ పూర్తి భద్రత ఉందని డిజిట్ సెక్యూర్ వ్యవస్థాపకుడు జయకృష్ణ తెలిపారు.
కంపెనీకి ఆర్‌బీఐ అనుమతితోపాటు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ ధ్రువీకరణ కూడా ఉందని చెప్పారు. వచ్చే నెలలో ఆన్‌డ్రాయిడ్‌తోపాటు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు ఈ సేవలను విస్తరిస్తామని, తద్వారా అత్యధికులు మొబైల్‌లో హాట్‌రెమిట్‌ను వాడొచ్చని అన్నారు. భారత్‌లో ఇ-వాలెట్ రంగంలో రూ.1.80 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.