న్యూఢిల్లీ : ప్రస్తుత సంక్షోభ సమయంలో అత్యంత సంపన్నులపై పన్ను విధించాలనే ప్రతిపాదనకే ప్రకంపనలు రేగుతున్నాయి. సంపన్నులపై పన్నుపోటు సూచనే ప్రభుత్వంలో ఉలికిపాటు కలిగిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే సూచనలను పరిశీలించడం, అమలు చేయతగినవి ఉంటే వాటిపై కసరత్తు జరపడం సాధారణంగా జరిగేదే. మరి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కకావికలమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యంత సంపన్నులపై వెల్త్ ట్యాక్స్‌తో పాటు కోవిడ్ -19 సెస్‌ను విదించాలన్న 50 మంది యువ ఐఆర్‌ఎస్ అధికారుల ప్యానెల్ సమర్పించిన విధాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సంసన్నులపై ఆదాయ పన్ను రేట్లను పెంచాలన్న ప్రతిపాదనకూ సాధ్యాసాధ్యాలను ప్రజల ముందుంచకుండానే ఆర్థిక మంత్రిత్వ శాఖ విముఖత చూపింది.
ఈ నివేదిక కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉద్దేశాలను ప్రతిబింబించదని ఆదాయ పన్ను శాఖ ప్రకటన స్పష్టం చేసింది. ఐఆర్‌ఎస్ అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలతో ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా అనుమతి కోరలేదని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 మహమ్మారి ప్రబావాన్ని ఎదుర్కొనేందుకు ఫోర్స్ పేరిట రూపొందించిన విధాన పత్రంలో ఈ సూచనలు పొందురిచామని ఐఆర్‌ఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కి సమర్పించామని వారు చెప్పారు. ఐఆర్‌ఎస్ అధికారులు తమ నివేదికను ట్విటర్‌లో పొందుపరిచారు.
చదవండి : బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు
పన్నుపోటుపై కలవరపాటు..
ఏడాదికి రూ కోటికి పైగా ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను రేటును 40 శాతానికి పెంచాలని, రూ 5 కోట్లు పైబడిన వార్షికాదాయంపై వెల్త్ ట్యాక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నివేదికలో పేర్కొంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ పది లక్షలు పైబడిన వారిపై 4 శాతం మేర కోవిడ్-19 సెస్‌ను విధించాలని నివేదికలో సూచించారు. కోవిడ్-19 సెస్ ద్వారా రూ 18,000 కోట్ల పన్ను రాబడి ఆర్జించవచ్చని నివేదిక వివరించింది. వీటితో పాటు పలు సూచనలను నివేదికలో ప్రస్తావించారు. సంక్లిష్ట సమయంలో దేశ విశాల ప్రయోజనాలను కాపాడటం సూపర్ రిచ్ బాధ్యతని ఐఆర్‌ఎస్ అధికారులు రూపొందించిన విధాన పత్రం స్పష్టం చేసింది.
కీలక ప్రాజెక్టులపై వ్యయం
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 5 నుంచి 10 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రబుత్వం గుర్తించి సంన్నులపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన రాబడిని నిర్ధిష్ట ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వెచ్చించాలని నివేదిక కోరింది. దేశంలో 1985 వరకూ అమల్లో ఉన్న వారసత్వ పన్నును కూడా తిరిగి ప్రవేశపెట్టాలని ఈ విధాన పత్రం సూచించింది. మరోవైపు నివేదికలో ఉన్న అంశాలపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. దేశంలో ఆదాయ పన్నురేట్లు మరింత పెంచితే వినియోగం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా ప్రతిపాదనలు అమలు చేస్తే మిలియనీర్లు దేశం విడిచివెళ్లడం ఖాయమని కొందరు చెప్పుకురాగా, మరికొందరు నెటిజన్లు మాత్రం సంక్షోభ సమయంలో సూపర్ రిచ్ బాధ్యత తీసుకోవాల్సిందేనని అబిప్రాయపడ్డారు
నివేదికపై నిప్పులు
నివేదికలో లేవనెత్తిన అంశాలపై కీలక చర్చకు తెరలేపాల్సిన తరుణంలో ఐఆర్‌ఎస్ అధికారులు తమ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది క్రమశిక్షణారాహిత్యమే కాకుండా బాధ్యతారాహిత్యమని పేర్కొంటోంది. ఐఆర్‌ఎస్ అధికారుల ప్రవర్తనపై వారిని వివరణ కోరాలని సీబీడీటీ చీఫ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది . ఇక సూపర్ రిచ్‌పై పన్ను ప్రతిపాదనకే ఇంతటి వివాదం చెలరేగిన నేపథ్యంలో వారిపై ఎలాంటి పన్ను భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనేందుకు ఇది సంకేతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపత్కాలంలో పేదలు, ఆపన్నులను ఆదుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు వచ్చే నిర్మాణాత్మక సూచనలను కేంద్రం పరిశీలించి అర్హమైన సూచనల అమలుకు పూనుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment