సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్డ్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు(గురువారం) లాంచ్ చేసింది. రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల రేంజ్‌లో దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ వేరియంట్ 1.5 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉండగా.. దీని ధర రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల వరకు ఉంది. డీజిల్ ఆప్షన్‌లో అంతకముందటి మోడల్ మాదిరే ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.8.01 లక్షల నుంచి రూ.10.67 లక్షల రేంజ్‌లో ఉంది. ఇది లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ కొత్త ఎకోస్పోర్ట్ భారతీయ మార్కెట్‌కున్న తమ నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందని ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు.
2013లో ఈ మోడల్‌ను తొలుత లాంచ్ చేసినప్పటి నుంచి 60-65 శాతం ఉన్న స్థానికత స్థాయిలను 85 శాతం వరకు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న మోడల్ ధరలను అదేవిధంగా ఉంచనున్నట్టు చెప్పారు. ఈ కొత్త ఎకోస్పోర్ట్‌లో 1600 మార్పులను ఫోర్డ్ చేపట్టింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీ, స్టాండర్డ్ ఈక్విప్‌మెంట్లతో దీన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను ఫోర్డ్ ఇండియా ఆపివేసింది. భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో ప్యాసెంజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న కంపెనీగా ఫోర్డ్ ఉందని మెహ్రోత్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment