డెబిట్ కార్డుల స్థానే ఉంగరాలు!
ఇక డెబిట్ కార్డులను మర్చిపోవాల్సిందే.. ఎందుకంటే వాటి స్థానాన్ని భర్తీ చేసే డెబిట్ రింగ్స్ వచ్చేస్తున్నాయట. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే రియో ఒలంపిక్ గేమ్స్ లో వీటిని ప్రయోగాత్మకంగా వీసా ప్రవేశపెట్టనుంది. ఇవి అచ్చం మనం వేళ్లకు పెట్టుకునే ఉంగరాల్లా ఉంటాయి. వీసా డెబిట్ కార్డుకు అనుమతి లభించే అధికారిక ఈవెంట్స్ లో ఈసారి ప్రయోగాత్మమైన రూపంలో అథ్లెట్ల ముందుకు ఈ రింగ్స్ ను తీసుకురానుంది. 45 మంది ఒలింపిక్ అథెట్లకు ప్రీ పెయిడ్ డెబిట్ రింగ్‌లను ఇవ్వనున్నట్లు వీసా పేర్కొంది. ఈ టెక్నాలజీని మొదట అథ్లెట్లకు పరిచయం చేసి, ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించడానికి వీసా గ్లోబల్ ఈవెంట్స్ ను మార్గంగా ఎంచుకుంటోంది.
ఈ రింగ్‌లో సెక్యూర్డ్ మైక్రోచిప్, ఎంబెడెడ్ యాంటెనా ఉన్నాయి. పైన కనిపించేదిగా బ్లాక్ అండ్ వైట్ సిరామిక్ లూప్ ను వీసా పొందుపరిచింది. ఈ రింగ్ కు ఎలాంటి బ్యాటరీ కానీ, చార్జింగ్ కానీ అవసరం లేదు. ఈ రింగ్‌తో ప్రీపెయిడ్ మొత్తాన్నిఅథ్లెట్లు పొందుతారు. వీసా కార్డులకు బదులుగా తీసుకురాబోయే ఈ పేమెంట్ రింగ్‌పై అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాలెట్లు, కార్డులు తీసుకెళ్లడం చికాకు అని, యునిఫాం మార్చుకునే ప్రతిసారి వాటిని జాగ్రత్త చేసుకోవడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. ఈ రింగ్ అయితే.. ఎంచక్కా వేలుకు ఉంగరంలా ధరించి దాంతోనే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీసా రింగ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని నాలుగుసార్లు స్విమింగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న మిస్సీ ఫ్రాంక్ లిన్ చెప్పారు.