స్వర్ణం స్వచ్ఛతకు భరోసా
న్యూఢిల్లీ: ఇటు వినియోగదారులకు అటు నగల వర్తకులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ప్యూరిటీకి సంబంధించిన గోల్డ్ హాల్‌మార్కింగ్ ఫీజును చిన్న పట్టణాల్లో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్యూరిటీ సర్టిఫికేషన్‌తో ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడానికి ఒక వ్యవస్థను సైతం ఆవిష్కరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. స్వచ్ఛమైన బంగారం అమ్మకాలను ప్రోత్సహించడం, ఇందుకు అనుగుణంగా హాల్‌మార్కింగ్ విధానాన్ని విస్తృతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక చొరవలను తీసుకుంది. ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ ఈ అంశాలను వెల్లడించారు.
ముఖ్యాంశాలు...
ఆభరణాల వర్తకులకు హాల్‌మార్కింగ్ లెసైన్స్ ఫీజును 87.5% వరకూ తగ్గించింది. దేశ వ్యాప్తం గా ఆభరణాల వర్తకులు అందరికీ ప్రస్తుతం గోల్డ్ హాల్‌మార్కింగ్ ఫీజు మూడేళ్లకు రూ.20,000 వరకూ ఉంది. తాజా తగ్గింపుతో ఈ ఫీజు చిన్న పట్టణాల్లో రూ.2,500కు తగ్గనుంది. మూడు లక్షలకన్నా తక్కువ జనాభా ఉన్న ప్రదేశాలను చిన్న పట్టణాలుగా పరిగణించడం జరుగుతుంది.
3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న పట్టణాలకు మూడేళ్లకు హాల్‌మార్కింగ్ లెసైన్స్ ఫీజు రూ.5,000గా ఉంటుంది.
నిజానికి బంగారం హాల్‌మార్కింగ్ ప్రస్తుతం తప్పనిసరికాదు. అయితే అధిక ఫీజు వల్ల హాల్‌మార్కింగ్‌కు లెసైన్స్ తీసుకోడానికి చిన్న పట్టణాల్లో ఆభరణాల వర్తకులు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా వినియోగదారులకు సైతం నష్టం కలుగుతున్న పరిస్థితి ఉంది. ఈ ధోరణిని నివారించడానికే కేంద్రం తాజా ఫీజు తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
ఫీజు తగ్గింపుతోపాటు, సంబంధిత లెసైన్స్ పొందే ప్రక్రియ సైతం సులభతరం కానుంది.
వినిమయ వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద కార్యకలాపాలు నిర్వహించే ఇండియన్ స్టాండెర్డ్స్ బ్యూరో (బీఐఎస్)- హాల్‌మార్కింగ్, పర్యవేక్షణా విధానాలను పర్యవేక్షిస్తుంటుంది. ప్రస్తుతం హాల్‌మార్కింగ్ విధానం దక్షిణాదిలో ప్రాచూర్యం పొందినంతగా ఉత్తరాదిలో లేదు. హాల్‌మార్కింగ్ బంగారం ఆభరణాల విక్రయాలు దక్షిణాదిలో 70 నుంచి 80 శాతం ఉంటుండగా, ఉత్తరాదిలో 15 నుంచి 20 శాతం వరకూ మాత్రమే ఉంది.
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా 10 గ్రాములకు పైగా బరువున్న ప్రతి ఆభరణంపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ముద్రించే విధానాన్ని బీఐఎస్ ప్రవేశపెడుతోంది.
ఆభరణాల వర్తకులకు లెసైన్సులను బీఐఎస్ మం జూరు చేస్తుంది. బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన ఆభరణాల వర్తకులు తమ హాల్‌మార్క్‌ను సంబంధింత 250 నిర్ధారణ కేంద్రాల నుంచి పొందొచ్చు.
ఆభరణంపై గుర్తింపు సంఖ్యను ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియను బీఐఎస్ ఒక ఐటీ కన్సల్టెంట్‌కు అప్పగిస్తుంది. ఈ నంబర్‌ను ఇవ్వడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఈ ప్రత్యేక సంఖ్య ద్వారా ఒక ఆభరణం మొత్తం చరిత్రను... అంటే అసలు ఆభరణం తయారీదారు ఎవ్వరు? హాల్‌మార్కింగ్ సెంటర్ ఏమిటి? ప్యూరిటీ సంగతేమిటి? వంటివన్నీ తెలుసుకోవచ్చు.
పరిశ్రమ, ఎగుమతిదారుల ప్రయోజనం, వ్యాపా రం పెంపుకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీఐఎస్ నిర్ణయించింది.