ఇక గూగుల్‌ ‘తేజ్‌’ | Google payment app 'Tez' launched | Sakshi
Sakshi News home page

ఇక గూగుల్‌ ‘తేజ్‌’

Published Tue, Sep 19 2017 12:38 AM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM

ఇక గూగుల్‌ ‘తేజ్‌’ - Sakshi

ఇక గూగుల్‌ ‘తేజ్‌’

డిజిటల్‌ చెల్లింపుల సేవలు ప్రారంభం
► తెలుగుసహా 8 భాషల్లో అందుబాటు    
► ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జైట్లీ


న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ డిజిటల్‌ చెల్లింపుల సేవల్లోకి అడుగు పెట్టింది. ‘తేజ్‌’ అనే పేరుతో గూగుల్‌ రూపొందించిన యాప్‌ను సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించారు. ఇది కేవలం భారత మార్కెట్‌ కోసమే తీసుకొచ్చిన యాప్‌ అని, ఎలక్ట్రానిక్‌ చెల్లింపులను మరింత భద్రంగా సులభంగా నిర్వహించడమే తేజ్‌ లక్ష్యమని గూగుల్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

యాప్‌లోకి బ్యాలన్స్‌ లోడ్‌ చేసుకునే అవసరం లేకుండా... నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు యాప్‌ ఓ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లోని క్యాష్‌ మోడ్‌ ద్వారా బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ నంబర్‌ వివరాలు అవసరం లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ టెక్నాలజీ సాయంతో తమ మొబైల్‌లోని మైక్రోఫోన్, స్పీకర్‌ సాయంతో లావాదేవీ పూర్తవుతుంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో దీన్ని గూగుల్‌ తీసుకొచ్చింది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని యాక్టివేట్‌ చేసుకునే సమయంలోనే అందుబాటులో ఉన్న అన్ని భాషలు కనిపిస్తాయి.

ఇంగ్లిష్‌ తెలియని వారు తమ మాతృ భాషలో యాప్‌ను సులభంగా వినియోగించుకునేందుకు గూగుల్‌ ఈ సదుపాయం కల్పించింది. రానున్న నెలల్లో వ్యాలెట్లు, కార్డులను తేజ్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించే ఆలోచనతో ఉంది. రూ.50కి పైన విలువ గల లావాదేవీలు చేసే వారికి రూ.1,000 వరకు విలువగల స్క్రాచ్‌ కార్డులను ఇవ్వనుంది. తేజ్‌ సేవలకు గాను గూగుల్‌ యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న 50 బ్యాంకుల కస్టమర్లు తేజ్‌ సేవలు వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. పీవీఆర్, రెడ్‌బస్‌ తదితర సంస్థలతో జట్టుకట్టగా, మరిన్ని  సంస్థలనూ తేజ్‌లో చేర్చేలా చర్చలు జరుపుతోంది.

డిజిటల్‌ చెల్లింపుల్లో పుష్కల అవకాశాలు
కేంద్రం గతేడాది పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న పేటీఎంకు గూగుల్‌ తేజ్‌ పోటీ ఇవ్వనుంది.  ‘‘మా ప్రధాన పోటీదారు నగదే. నగదు బదులు మరింత మంది ప్రజలు డిజిటల్‌ చెల్లింపులను వినియోగించుకునేలా చేయడంపైనే మా దృష్టి. ఎంతో మందికి ఇక్కడ పుష్కల అవకాశాలున్నాయి’’ అని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డయానా లేఫీల్డ్‌ తెలిపారు. భారత్‌లో 40 కోట్ల మందికిగాను 30 కోట్ల మంది తమ స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని, 2020 నాటికి వీరి సంఖ్య 65 కోట్లకు చేరుతుందని, భారత్‌ను ఇంటర్నెట్‌ సమ్మిళిత భారత్‌గా మార్చడమే గూగుల్‌ ధ్యేయమని సంస్థ భారతీయ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనందన్‌ తెలిపారు.   

సౌకర్యమని గుర్తించారు: జైట్లీ
మరింత ఆధునిక పరిజ్ఞానం మార్కెట్లోకి వస్తే డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకుంటాయని తేజ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘డిజిటల్‌ చెల్లింపులన్నవి తప్పనిసరి అని కాకుండా సౌకర్యమని గుర్తించారు. దీంతో ఇదో అలవాటుగా మారింది. ఇది మరోసారి పుంజుకునేందుకు సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement