న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాల పరంపర కొనసాగుతోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నష్టాలు జనవరి– మార్చి త్రైమాసికంలో మరింత పెరిగాయి. 2016–17 క్యూ4లో రూ.647 కోట్లుగా ఉన్న నికర నష్టాలు తాజా త్రైమాసికంలో దాదాపు ఐదు రెట్లకు పైగా పెరిగి రూ.3,607 కోట్లకు ఎగిశాయి. ఆర్‌బీఐ నిబంధనలను మరింత కఠినతరం చేయడం వల్ల మొండి బకాయిలు భారీగా పేరుకుపోయాయని బ్యాంక్ తెలిపింది. ఈ మొండి బకాయిలకు కేటాయింపులు కూడా అదే స్థాయిలో చేయడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.5,662 కోట్ల నుంచి రూ.5,814 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.4,630 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.4,828 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిలకు, ఇతర అంశాలకు మొత్తం కేటాయింపులు రూ.1,790 కోట్ల నుంచి దాదాపు నాలుగింతలై రూ.6,775 కోట్లకు చేరుకున్నాయని బ్యాంకు తెలియజేసింది.
మెరుగుపడ్డ రికవరీలు
బ్యాంక్ రుణ నాణ్యత మరింత అధ్వానంగా మారింది. 2016–17 క్యూ4లో 22.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు తాజా ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25.28 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 13.99 శాతం నుంచి 15.33 శాతానికి చేరుకున్నాయి. అయితే మొండి బకాయిల రికవరీ మాత్రం మెరుగుపడిందని బ్యాంక్ తెలిపింది. రికవరీలు రూ.2,729 కోట్ల నుంచి రూ.5,726 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,417 కోట్లుగా ఉన్న నికర నష్టాలు 2017–18లో రూ.6,299 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.3,650 కోట్ల నుంచి రూ.3,628 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.23,091 కోట్ల నుంచి రూ.21,662 కోట్లకు చేరింది. 2017–18 క్యూ4లో ప్రభుత్వం నుంచి రూ.4,694 కోట్ల మూలధన పెట్టుబడులు వచ్చాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్ 2.4 శాతం నష్టంతో రూ.16.25 వద్ద ముగిసింది.
ఐఓబీ నష్టాలు రూ.3,607 కోట్లు
Published Thu, May 31 2018 1:57 AM | Last Updated on Thu, May 31 2018 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment