రూ.300 కోట్లు వెచ్చించనున్న ఎల్‌వీపీఈఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేత్ర వైద్య రంగ సంస్థ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్(ఎల్‌వీపీఈఐ) వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్లను శిక్షణ కేంద్రాల సామర్థ్యం పెంపుకు వ్యయం చేస్తోంది. ప్రస్తుతం సం స్థకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, భువనేశ్వర్‌తోసహా మరో 11 చోట్ల శిక్షణ కేంద్రాలున్నాయి. ఆప్టోమెట్రీ, ఆఫ్తల్మాలజీ, నర్సింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. సంస్థకు ఏక కాలంలో 400 మందికి శిక్షణ ఇచ్చే వీలుంది. మూడేళ్లలో ఈ సంఖ్యను రెండింతలకు చేరుస్తామని సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి ఎన్ రావు తెలిపారు.
ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 18-20 వేల మంది నేత్రవైద్యులున్నారని, అయితే టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని చెప్పారు. రోగులకు తక్కువ వ్యయానికే అత్యాధునిక వైద్యం అందించేందుకు పరిశోధనలనుపెద్ద ఎత్తున కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇండియా ఇంక్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్‌ను రూ.6 వేల కోట్లకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ రఘునాథ్ మషేల్కర్ వెల్లడించారు. సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని తక్కువ ధరకు అందించడంపైనే అన్ని కంపెనీలు దృష్టిసారిస్తున్నాయని అన్నారు.