బ్యాంక్ రుణాలకు సంబంధించి మరో రూ.9 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. వాణిజ్య యుద్ధాల భయాలతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,400 పాయింట్ల దిగువకు పడిపోయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 33,686 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 10,360 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడంతో నష్టాలు ఒకింత తగ్గినప్పటికీ, చివర్లో అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా పెరిగాయి.
పీఎన్‌బీలో తాజా రూ.9 కోట్ల స్కామ్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ బ్రాంచ్.. చంద్రి పేపర్స్ అండ్ అల్లైడ్ ప్రోడక్ట్స్‌కు రూ.9 కోట్ల మేర అక్రమంగా రుణాలిచ్చిందంటూ తాజాగా సీబీఐ కేసును నమోదు చేయడంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. భారత్ ఎగుమతి సబ్సిడీ స్కీమ్‌లపై డబ్ల్యూటీఓలో అమెరికా ఫిర్యాదు చేయడం, చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు చర్యలు తీసుకుంటారన్న వార్తలు (ఈ వార్తలను ఆ తర్వాత అమెరికా ఖండించినప్పటికీ)వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా రేకెత్తించాయి. వచ్చే వారమే ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మార్కెట్ పతనం కొనసాగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని సాధించగలదన్న ప్రపంచ బ్యాంక్ అంచనాలు కొంత సానుకూలతను చూపాయని, అయితే వాణిజ్య యుద్ధ భయాలు, రానున్న రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సంశయాలు ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, దేశీయంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ కార్తీక్‌రాజ్ లక్ష్మణన్ చెప్పారు.
229 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్..
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 31 పాయింట్ల లాభంతో 33,866 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్ షేర్ల పతనం కారణంగా ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. ఒక దశలో 198 పాయింట్ల నష్టంతో 33,637 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 229 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9 పాయింట్లు లాభపడగా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది.
ఎమ్‌ఎమ్‌టీసీ 20 శాతం అప్...
ఈ నెల 19న జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో బోనస్ షేర్ల జారీ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్న ఎమ్‌ఎమ్‌టీసీ వెల్లడించడంతో ఎమ్‌ఎమ్‌టీసీ 20 శాతం ఎగసింది. యస్ బ్యాంక్ 2 శాతం నష్టపోయి రూ. వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్1.6 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.2 శాతం, ఎస్‌బీఐ 1.1 శాతం, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 1.3 శాతం వరకూ నష్టపోయాయి.
ఫెర్టిలైజర్స్ షేర్ల పరుగు
యూరియా సబ్సిడీని 2020 వరకూ కేంద్రం పొడిగించడంతో ఎరువుల షేర్లు కళకళలాడాయి. ఎరువుల సబ్సిడీకి నేరుగా నగదు బదిలీ విధానాన్ని ఆచరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 10 శాతం, నేషనల్ ఫెర్టిలైజర్స్ 5 శాతం, ఆర్‌సీఎఫ్ 4 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 5.3 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment