పడగొట్టిన పన్ను భయాలు
ఆదుకోని అరుణ్ జైట్లీ వివరణ
• ఏడు నెలల కనిష్టానికి నిఫ్టీ
• 77 పాయింట్ల నష్టంతో 7,908 వద్ద ముగింపు
• 234 పాయింట్ల నష్టంతో 25,807కు సెన్సెక్స్
మార్కెట్ల నుంచి పన్నుల రూపంలో అధికాదాయం రావలసి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సోమవారం స్టాక్ మార్కెట్‌ను నష్టాల పాలు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26వేల పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు నష్టపోయి 25,807 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టపోయి 7,908 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో రెండు స్టాక్ సూచీలు ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. వాహన, ఫార్మా, లోహ, రియల్టీ, బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.
అమ్మకాల వెల్లువ...: క్యాపిటల్ మార్కెట్లు పన్ను చెల్లింపుల్ని అధికం చేయాల్సివుందంటూ శనివారం నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంతో స్టాక్ మార్కెట్‌లో కలకలం ఏర్పడింది. అయితే క్యాపిటల్ గెయిన్స్‌పై దీర్ఘకాలిక పన్ను విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చినప్పటికీ, స్టాక్ సూచీలకు నష్టాలు తప్పలేదు. ప్రధాని వ్యాఖ్యలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్ నష్టపోయింది.
⇔ ఇప్పటికే పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో కుదేలైన ఇన్వెస్టర్ల సెంటిమెంట్, క్యాపిటల్ మార్కెట్ నుంచి అధిక పన్ను ఆదాయం రావాలంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో మరింత బలహీనపడిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తగిన వివరణ ఇచ్చినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను కొనసాగించారని వివరించారు. డిసెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకోవడం, కొన్ని షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు కొంత తగ్గాయని నిపుణులు పేర్కొన్నారు.
కొనసాగిన దివీస్ నష్టాలు..
దివీస్ ల్యాబ్స్ నష్టాలు సోమవారం కూడా కొనసాగాయి. వైజాగ్ ప్లాంట్‌పై అమెరికా ఎఫ్‌డీఏ అభ్యంతరాల నేపథ్యంలో శుక్రవారం 22 శాతం పతనమైన ఈ షేర్ సోమవారం 12 శాతం నష్టపోయి రూ.765 వద్ద ముగిసింది. రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 33 శాతానికి పైగా నష్టపోయింది. మొత్తం రూ.9,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది.